నేడు రాజ్యసభలో కాళేశ్వరంపై వాడివేడిగా వాదోపవాదాలు జరిగాయి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటెల్ మాట్లాడుతూ, “బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుని ఏటిఎంలా వాడుకోంది,” అని ఆరోపించారు.
దీనిపై బీఆర్ఎస్ పార్టీ ఎంపీ సురేష్ రెడ్డి తీవ్ర అభ్యంతరం చెప్తూ, “కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం డబ్బు సమకూర్చుకొని నిర్మించింది. కనుక కేంద్ర మంత్రి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి,” అని అన్నారు.
అప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ, “కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి రాకుండా పోవడానికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకమే. కేసీఆర్ కుటుంబం కాళేశ్వరంని ఏటిఎంలా వాడుకోందనే విషయంలో ఎటువంటి సందేహమూ లేదు. లక్ష కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్ కుటుంబం విచ్చలవిడిగా ఖర్చుచేసి వాడుకున్నారు. కేసీఆర్ నిర్వాకం వల్లనే మేడిగడ్డ బ్యారేజ్ క్రుంగిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాకుండా పోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమీషన్ వేసి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ద్రువీకరించుకున్నాక కేసీఆర్‌ని అరెస్ట్ చేస్తామని చెప్పారు. కానీ అరెస్ట్ చేయనేలేదు. ఆనాడు రాష్ట్ర విభజన తర్వాత ఏడు మండలాలను ఏపీలో కలిపేందుకు కేసీఆర్ కూడా అంగీకరించారు. విలీనం తర్వాత కేసీఆర్ కుటుంబ సభ్యులందరినీ వెంటపెట్టుకొని సోనియా గాంధీ ఇంటికి వెళ్లి ఫోటోలు దిగిన మాట వాస్తవం కాదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
సురేష్ రెడ్డి కూడా “కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజ్ ఒకటే కాదని వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడ వద్దంటూ, కిషన్ రెడ్డికి హితవు పలికారు.