రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు కావస్తోంది. ఏపీకి రాజధాని ఏర్పాటు చేసుకునే వరకు పదేళ్ళపాటు హైదరాబాద్ రాజధానిగా ఉంటుందని చెప్పినప్పటికీ, సిఎం చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించి, నిర్మాణ పనులు చేపట్టారు. హైదరాబాద్ నుంచి కార్యాలయాలను, అధికారులు, ఉద్యోగులు అందరినీ ఏపీకి తరలించుకుపోయారు.
కానీ ఆయన తర్వాత సిఎం పదవి చేపట్టిన జగన్ అమరావతిని రాజధానిగా అంగీకరించలేదు. కనుక అమరావతి నిర్మాణ పనులను ఎక్కడివక్కడ నిలిపివేసి 5 ఏళ్ళు పాడుబెట్టేశారు. ఆ తర్వాత రాష్ట్రానికి ఒకటి కాదు మూడు రాజధానులు ఉండాలంటూ 5 ఏళ్ళు కాలక్షేపం చేశారు. చివర్లో విశాఖ రాజధాని అన్నారు కానీ అదీ ఏర్పాటు చేయలేకపోయారు.
చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రావడంతో అమరావతి నిర్మాణ పనులు మొదలుపెట్టి వేగవంతం చేశారు. భవిష్యత్‌లో మళ్ళీ జగన్ వలన ఇలాంటి సమస్య తలెత్తకూడదని అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు.
మోడీ ప్రభుత్వం దానికి ఆమోదం తెలిపి నేడు లోక్‌సభలో ఆ బిల్లు ప్రవేశపెట్టింది. దానిపై నేడు లోక్‌సభ ఆమోదం తెలిపిన తర్వాత రేపు రాజ్యసభలో ఆమోదం పొందుతుంది. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పేరుని చేర్చుతూ పార్లమెంటులో చట్ట సవరణ జరుగుతోంది. దీంతో 2024, జూన్ 2 నుంచి అమరావతి రాజధానిగా అమలులోకి వస్తుంది.