అప్పుడు గేమ్‌ చేంజర్, ఇప్పుడు పెద్ది... విశ్వంభరకు బ్రేకులు

March 27, 2026
img

తండ్రిని మించిన కొడుకు.. గురువుని మించిన శిష్యుడు.. గొప్ప విషయమే. తండ్రికి, గురువుకీ కూడా ఆనందమే!

కానీ మెగాస్టార్ చిరంజీవికి ఇప్పుడు కొడుకు రామ్‌ చరణ్‌ సినిమాలే ఎప్పటికప్పుడు అడ్డుగోడ కట్టేస్తూ వాయిదా వేసుకునేలా చేస్తున్నాయి. 

మల్లాది వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ గత ఏడాది జనవరిలో విడుదల కావాల్సి ఉండగా, రామ్‌ చరణ్‌ నటించిన ‘గేమ్‌ చేంజర్’ కోసం వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. కానీ భారీ బడ్జెట్‌తో తీసిన ‘గేమ్‌ చేంజర్’ ఫ్లాప్ అవడంతో ‘విశ్వంభర’ని మరోసారి చెక్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ గ్యాప్‌లో రామ్‌ చరణ్‌ నటిస్తున్న ‘పెద్ది’ పూర్తిచేసేశారు. ఇప్పుడు ‘పెద్ది పహిల్వాన్’ హవా నడుస్తోంది. 

కనుక ఇలాంటి సమయంలో ‘పెద్ది పహిల్వాన్’తో విశ్వంభర పోటీ పడటం ఎంత మాత్రం మంచిది కాదు. కనుక మళ్ళీ  వెనక్కు తగ్గాల్సి వచ్చింది. పెద్ది ఏప్రిల్‌ 30న పెద్ది విడుదల కాబోతోంది. అ తర్వాత పెద్ది  హడావుడి మరో ఒకటి రెండు నెలలు ఉంటుంది. కనుక పెద్ది బ్యాట్ పక్కన పెట్టేసే వరకు విశ్వంభర బరిలో దిగడం ప్రమాదమే. 

కానీ పెద్ది పూర్తవగానే రామ్‌ చరణ్‌ సుకుమార్‌తో మరో సినిమా మొదలుపెట్టబోతున్నారు. దాని ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది. కనుక రామ్‌ చరణ్‌-సుకుమార్ ఆ సినిమాని వెంటనే మొదలుపెడితే దసరా దీపావళికి లేదా వచ్చే సంక్రాంతికి విడుదల చేయడం ఖాయం. 

జగదేకవీరుడు-అతిలోక సుందరి తర్వాత అంత భారీ అంచనాలతో చిరంజీవి చేసిన సోషియో ఫ్యాంటసీ సినిమా ‘విశ్వంభర.’ కనుక ఇది ఆయనకు చాలా ముఖ్యమైనది. 

కానీ రామ్‌ చరణ్‌ సినిమాలతో విశ్వంభరకు గ్యాప్ దొరకడం లేదు. మరి విశ్వంభర కోసం రామ్‌ చరణే కాస్త గ్యాప్ ఇవ్వాలి. లేకుంటే మరో ఏడాది తర్వాత విడుదల చేసినా బోర్లా పడే ప్రమాదం ఉంటుంది.

Related Post