డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమన్నారంటే, “దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి ఎలాంటి నష్టం కలగకుండా ఆ బిల్లులో కేంద్రం మార్పులు చేసి తీసుకొస్తోంది.
పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న 24 శాతం ప్రాతినిధ్యం కొనసాగించాలన్న తమ డిమాండ్‌కు కేంద్రం అంగీకరించించింది కనుకనే దీనికి మేము మద్దతు పలికాము. ఈ కొత్త ప్రతిపాదనను మేము స్వాగతిస్తున్నాము.
డీలిమిటేషన్ విషయంలో బీఆర్ఎస్ మొదటి నుంచి ఇదే వైఖరి అనుసరిస్తోంది. జనాభా నియంత్రణలో విజయం సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల తగ్గింపు శిక్షగా మారరాదని అప్పుడే మేము చాలా విస్పష్టంగా చెప్పాము.
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది కనుక అప్పుడు ఆ బిల్లును వ్యతిరేకించాము. ఇప్పుడు కేంద్రం సవరించిన ప్రతిపాదనలలో కూడా మా అభ్యంతరాలను పరిష్కరించింది.
ఈ తాజా ప్రతిపాదన ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 180కి, లోక్‌సభ స్థానాలు 26కు పెరిగే అవకాశం ఉంటుంది. పార్లమెంటులో సీట్ల సంఖ్యను 50 శాతం పెంచడంతో పాటు 2051 వరకు రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య నిష్పత్తిని మార్చకుండా రక్షణ కల్పించడం శుభ పరిణామమే.
ఈ బిల్లులో ఈ మార్పులు బీఆర్ఎస్ పార్టీతో పాటు దక్షిణాది రాష్ట్రాల ఐక్య ఉద్యమ ఫలితమే అని భావిస్తున్నాను.
డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగాలి. దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చే ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తోంది? దీనిపై కాంగ్రెస్ తన వైఖరి స్పష్టం చేయాలి, అని కేటీఆర్ అన్నారు.