తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ప్రస్థానం జడ్పీటీసీ సభ్యుడిగా, స్వతంత్ర ఎమ్మెల్సీగా సాదాసీదాగానే మొదలైంది.
టీడీపీలో చేరిన తర్వాత 2009, 2014 ఎన్నికల్లో కొడంగల్ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఆయన రాజకీయ జీవితంలో మరో మెట్టు ఎక్కారు.
కానీ 2014, జూన్ 2న రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టడం, ఆయన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను నిర్వీర్యం చేయడంతో చాలా మంది రాజకీయ నాయకుల్లాగే రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం కూడా మళ్లీ మొదటికొచ్చిందనే చెప్పాలి.
2017 అక్టోబరు 31న రేవంత్ రెడ్డి ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన రాజకీయ జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. పార్టీలో చేరిన మరుసటి సంవత్సరమే, అంటే 2018 సెప్టెంబరులో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓటమి పాలైనప్పటికీ, 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొంది తన సత్తా చాటుకున్నారు.
2021, జూలై 7న టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడంతో ఆయన అసలు ప్రయాణం మొదలైందని చెప్పవచ్చు.
ఓ పక్క పార్టీలో సీనియర్ల మధ్య కుమ్ములాటలు కొనసాగుతుండగా, మరోపక్క ఆయన నాయకత్వాన్ని పలువురు సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించేవారు. ఇంకోవైపు కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారింది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూనే తన నాయకత్వంపై నమ్మకం లేని సీనియర్ నేతలను ఒక్కొక్కరినీ కలుపుకుపోయేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు.
పీసీసీ అధ్యక్షుడు అంటే గాంధీభవన్లో ప్రెస్మీట్లు పెట్టడం మాత్రమే కాదంటూ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు, బహిరంగ సభల ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.
అప్పటి వరకు రేవంత్ రెడ్డిని పెద్దగా పట్టించుకోని కేసీఆర్ మేల్కొని ఆయనను కట్టడి చేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోరాడారు.
అపర చాణక్యుడిగా పేరొందిన కేసీఆర్ నాయకత్వంలోని, తెలంగాణలో తిరుగులేదనుకున్న బీఆర్ఎస్ పార్టీని ఓడించారు.
కాంగ్రెస్ పార్టీ 119 స్థానాలకు గాను 64 స్థానాలను గెలుచుకుని అధికారాన్ని కైవసం చేసుకుంది. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్ రెడ్డి, 2023 డిసెంబరు 7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆ తర్వాత సీనియర్ నేతలకు సముచిత ప్రాధాన్యం, పదవులు కల్పిస్తూ అందరూ తన నాయకత్వాన్ని అంగీకరించేలా చేసుకున్నారు. గల్లీ స్థాయి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి, అపర చాణక్యుడిగా పేరొందిన కేసీఆర్ను ఓడించిన నేతగా రేవంత్ రెడ్డి గుర్తింపు పొందారు.
కాంగ్రెస్ అధిష్ఠానానికి కీలకమైన రాజకీయ నిర్ణయాల్లో సలహాలు, సూచనలు ఇస్తూ ముఖ్యమైన నేతగా ఆదరణ పొందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.
డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. కనుక భవిష్యత్తులో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితే అందులో రేవంత్ రెడ్డి కీలక పదవి చేపట్టినా ఆశ్చర్యం లేదు.