తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2009, నవంబర్ 29న అప్పటి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అంతకు ముందు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఏళ్ళ తరబడి అనేక రకాలుగా పోరాటాలు చేశారు. అనేక మంది బలిదానాలు చేసుకుంటూనే ఉన్నారు.
అయినా నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాలకే ప్రదాన్యం ఇస్తూ కాలక్షేపం చేసింది. ఈ నాన్పుడు వలన అప్పటికే తెలంగాణ ప్రజలలో ఉద్యమస్పూర్తి సన్నగిల్లుతుందని గ్రహించిన కేసీఆర్ ‘ఇక నేను సచ్చుడో తెలంగాణ వచ్చుడో... అమీతుమీ తేలిపోవాల్సిందే,” అంటూ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు.
సిద్ధిపేటలో ఆమరణ దీక్ష చేసేందుకు కేసీఆర్ 2009, నవంబర్ 29న కరీంనగర్ జిల్లా అలుగునూరు నుంచి బయలుదేరారు. కానీ దారిలోనే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకి తరలించగా, అక్కడే ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు.
నానాటికీ ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో, పోలీసులు ఆయనని హైదరాబాద్ నీమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. కానీ అక్కడ కూడా దీక్ష విరమించకుండా కొనసాగించడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది.
అయినా కేసీఆర్ పట్టు విడవలేదు. అదే సమయంలోనే (డిసెంబర్ 4) శ్రీకాంతాచారి హైదరాబాద్ ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద ఆత్మాహుతి చేసుకున్నారు. ఓ పక్క కేసీఆర్ ఆరోగ్యం నానాటికీ విషమిస్తుంటే, మరోపక్క శ్రీకాంతాచారి బలిదానంతో తెలంగాణ ఉద్యమాలు ఉదృతంగా మారాయి.
దీంతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం 2009, డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఆ ప్రకటన వెలువడిన తర్వాతే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష విరమించారు.
తెలంగాణ ఏర్పాటుకు అప్పుడే తొలి బీజం పడింది కనుక బీఆర్ఎస్ పార్టీ ‘దీక్షా దివస్’పాటిస్తోంది. ఈ సందర్భంగా నేడు బీఆర్ఎస్ పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ‘దీక్షా దివస్’ పేరుతో నాడు కేసీఆర్ నేతృత్వంలో జరిగిన పోరాటాలను గుర్తుచేసుకుంటున్నారు.