డీలిమిటేషన్ బిల్లుకు ఈసారైనా ఆమోదం లభిస్తుందా?

November 28, 2026


img

నవంబర్ 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు, లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభ స్థానాల పెంపు, వీటి కోసం నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లులు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతోంది. వీటికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కనుక వీటిని ఆమోదింపజేసుకునేందుకు నాలుగు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో లోక్‌సభ, డిసెంబర్ 2 , 3 తేదీలలో రాజ్యసభ సమావేశాలు జరుగుతాయి. 

ప్రతిపాదిత బిల్లుల ప్రకారం లోక్‌సభలో ప్రస్తుత 543 స్థానాలను 50 శాతం పెంచి గరిష్ఠంగా 850కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. దక్షిణాది రాష్ట్రాల సూచనలు, అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకొని శాసనసభ స్థానాలను 50 శాతం పెంచాలని నిర్ణయించింది. తద్వారా అన్ని రాష్ట్రాలకు పార్లమెంట్‌లో తగిన ప్రాతినిధ్యం ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 

ఈ రెండు బిల్లులకు 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పుడు ఆమోదింపబోయే డీలిమిటేషన్ బిల్లుతో మారబోయే లోక్‌సభ స్థానాలను 2051 వరకు కొనసాగించే ప్రతిపాదన కూడా ఉంది.

గత ఏప్రిల్‌లో ఇదే అంశంపై ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ సాధించలేకపోయింది. ఈసారి కొత్త ప్రతిపాదనలతో బిల్లులను ఆమోదింపజేసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. అయితే వీటికి ఇండీ కూటమి సహకరించే అవకాశం లేనందున డీఎంకే, ఎన్సీపీ, బీజేడి తదితర పార్టీల మద్దతుతో ఈ రెండు బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు బిజేపి నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.


Related Post