కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ప్రవేశపెట్టబోతోంది. లోక్‌సభలో ఎన్డీయేకు పూర్తి బలం ఉన్నందున అక్కడ ఆమోదముద్ర పడటం ఖాయమే.
ఈ బిల్లులకు బీఆర్ఎస్, డీఎంకే, ఎన్సీపీ తదితర పార్టీలు మద్దతు ప్రకటించినందున రాజ్యసభ ఆమోదం కూడా లభించడం ఖాయంగానే కనిపిస్తోంది.
కనుక డీలిమిటేషన్ చట్టం అమలులోకి వస్తే తమ రాష్ట్రాలలో ఎన్ని ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయని ప్రతీ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు లెక్కలు కట్టుకున్తున్నాయి.
కనుక తెలంగాణ లెక్కలు చూసుకుంటే ప్రస్తుతం ఉన్న 17 లోక్‌సభ స్థానాలు 26కు పెరగనున్నాయి. అంటే రాష్ట్రంలో మరో తొమ్మిది మంది ఎంపీలు పెరుగుతారన్న మాట. అలాగే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ప్రస్తుతం ఉన్న 119 స్థానాలు సుమారు 179-182 వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే సుమారు 60-63 మంది ఎమ్మెల్యేలు పెరుగుతారన్న మాట.
తెలంగాణతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా ఎంపీ, ఎమ్మెల్యేల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. కనుక దేశంలోని ‘రాజకీయ నిరుద్యోగులు’ పాలిట ఈ డీలిమిటేషన్ బిల్లు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ వంటిదే అనుకోవచ్చు.
కనుక కాంగ్రెస్ మిత్ర పక్షాలు ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆయా పార్టీలలో రాజకీయ నిరుద్యోగులు కూడా ఈ బిల్లుకి ఆమోదముద్ర పడాలని కోరుకుంటూనే ఉంటారు. లోలోన చాలా సంతోషిస్తుంటారని చెప్పక తప్పదు.