తెలంగాణ శాసనసభలో నేడు అత్యంత అరుదైన బిల్లుని ఏకగ్రీవంగా ఆమోదించింది. అదే వృద్ధ తల్లితండ్రుల రక్షణకి నిర్దేశించిన బిల్లు. దీనిపై శాసనసభలో అధికార, ప్రతిపక్షాలు చర్చించి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి.
గవర్నర్ ఆమోదముద్ర లాంచనప్రాయమే కనుక త్వరలోనే ఈ చట్టం అమలులోకి రాబోతోంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి అధ్వర్యంలో కమీషన్ ఏర్పాటు చేస్తుంది. అలాగే జిల్లా స్థాయిలో కలెక్టర్ లేదా ప్రత్యేకాధికారిని నియమిస్తుంది.
పిల్లల నిరాధరణకు గురవుతున్న తల్లితండ్రులు జిల్లా అధికారిని కలిసి తమ పరిస్థితి వివరించి దరఖాస్తు చేసుకోవాలి. దాని ఆధారంగా వారి కుమారులు లేదా కుమార్తెలకు నోటీసు పంపించి వారితో జిల్లా అధికారి మాట్లాడుతారు.
వారు సానుకూలంగా స్పందిస్తే సరి లేకుంటే వారి పని చేస్తున్న సంస్థతో మాట్లాడి వారి జీతం నుంచి నెలనెలా ఈ సొమ్ము వారి తల్లితండ్రులు బ్యాంక్ ఖాతాలో జమా అయ్యేలా ఏర్పాటు చేస్తారు.
తల్లితండ్రుల నుంచి దరఖాస్తు అందిన 60 రోజులలో జిల్లా అధికారి వారి సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది.
ఒకవేళ ఆ అధికారి ఉత్తర్వులపై అభ్యంతరాలు ఉంటే ప్రధాన కమీషనర్‌కి అప్పీలు చేసుకోవచ్చు. ఆయన లేదా ఆమె కూడా అప్పీలు దరఖాస్తు అందిన 60 రోజులలో సమస్యని పరిష్కరించాల్సి ఉంటుంది.
ఒకవేళ తల్లితండ్రులలో ఒకరు చనిపోతే ఆ సొమ్ముని జీవించి ఉన్నవారికి చెల్లించబడుతుంది. ఇద్దరూ చనిపోతే జిల్లా అధికారికి వారి ‘డెత్ సర్టిఫికేట్’ సమర్పిస్తే జీతంలో కోత నిలిపివేస్తూ సదరు సంస్థకు ఉత్తర్వులు జారీ చేస్తారు.