బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం రేవంత్ రెడ్డి శాసనసభలో హైదరాబాద్ మెట్రో స్వాధీనం గురించి ఎల్&టి భూములు భూముల గురించి పచ్చి అబద్దాలు చెప్పారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో ఎల్&టి కంపెనీకి 280 ఎకరాల భూమిని లీజుకి మాత్రమే ఇచ్చింది. రూ.22,000 కోట్లు విలువైన ఆ భూములను తమ ప్రభుత్వం కేవలం రూ.15,000 కోట్లకే కొనుగోలు చేస్తోందని సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు.
ఆ భూములు ఎల్&టి కంపెనీ సొంతవి కావు. హైదరాబాద్ మెట్రో నిర్వహణ ఖర్చుల కోసం వాటిని ప్రభుత్వం ఆ కంపెనీకి లీజుకి ఇచ్చింది. కనుక ఎల్&టి కంపెనీ హైదరాబాద్ మెట్రో నుంచి తప్పుకుంటునప్పుడు, ఆ భూములను, వాటిలో నిర్మించిన కట్టడాలతో సహా ప్రభుత్వానికి అప్పగించాలి.
అలా ప్రభుత్వానికి చెందిన భూములకు రూ.15,000 కోట్లు చెల్లించడమే తప్పు. దానిని కారు చవుకగా కొనుగోలు చేస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పుకోవడం ఇంకా సిగ్గుచేటు. ఇదెలా ఉందంటే మన ఇంటిని మనమే డబ్బు చెల్లించి కొనుకుంటున్నట్లే ఉంది.
నగరం నడిబొడ్డున ఉన్న విలువైన ఆ భూములను కొట్టేసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా చేస్తోంది. లేకుంటే ఆ భూములు చేతికి వచ్చిన తర్వాత ప్రభుత్వం వాటిని ఏవిధంగా ఉపయోగించుకోబోతోందో సిఎం రేవంత్ రెడ్డి చెప్పాలి,” అంటూ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.