దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది వృద్ధులు దయనీయ పరిస్థితిలో జీవిస్తున్నారు. వారిలో చాలా మంది పిల్లలు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ బాగానే సంపాదిస్తున్నప్పటికీ తల్లితండ్రులను ఆస్తులు పంచుకుంటున్నారు కానీ వారి యోగక్షేమాలు పట్టించుకోవడం లేదు. దీనికి తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఒక చక్కటి పరిష్కారం కనిపెట్టి అమలు చేయబోతున్నారు.
వృద్ధులైన తల్లితండ్రులను పిల్లలు పట్టించుకోకపోతే వారి జీతం నుంచి 15 శాతం లేదా నెలకు రూ.10,000 ఏది తక్కువైతే అది కోత విధించి నేరుగా తల్లితండ్రుల బ్యాంక్ ఖాతాలో జమా చేసే విధంగా చట్టం తెబోతున్నారు.
దీని కోసం ఇప్పటికే బిల్లుని సిద్ధం చేశారు. శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారు. తర్వాత గవర్నర్ ఆమోదముద్ర పడితే చట్టంగా మారుతుంది.
దీని విధివిధానాలు ఎలా అంటే...
దీని కోసం ప్రభుత్వం నియమించిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి రాష్ట్ర స్థాయిలో ప్రధాన కమీషనర్‌గా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ లేదా ప్రత్యేక అధికారిని ప్రభుత్వం నియమిస్తుంది.
నిరాధరణకు గురవుతున్న తల్లితండ్రులు జిల్లా అధికారిని కలిసి తమ పరిస్థితి వివరించి దరఖాస్తు చేసుకోవాలి. దాని ఆధారంగా వారి కుమారులు లేదా కుమార్తెలకు నోటీసు పంపించి వారితో జిల్లా అధికారి మాట్లాడుతారు.
వారు సానుకూలంగా స్పందిస్తే సరి లేకుంటే వారి పని చేస్తున్న సంస్థతో మాట్లాడి వారి జీతం నుంచి నెలనెలా ఈ సొమ్ము వారి తల్లితండ్రులు బ్యాంక్ ఖాతాలో జమా అయ్యేలా ఏర్పాటు చేస్తారు.
తల్లితండ్రుల నుంచి దరఖాస్తు అందిన 60 రోజులలో జిల్లా అధికారి వారి సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది.
ఒకవేళ ఆ అధికారి ఉత్తర్వులపై అభ్యంతరాలు ఉంటే ప్రధాన కమీషనర్‌కి అప్పీలు చేసుకోవచ్చు. ఆయన లేదా ఆమె కూడా అప్పీలు దరఖాస్తు అందిన 60 రోజులలో సమస్యని పరిష్కరించాల్సి ఉంటుంది.
ఒకవేళ తల్లితండ్రులలో ఒకరు చనిపోతే ఆ సొమ్ముని జీవించి ఉన్నవారికి చెల్లించబడుతుంది. ఇద్దరూ చనిపోతే జిల్లా అధికారికి వారి ‘డెత్ సర్టిఫికేట్’ సమర్పిస్తే జీతంలో కోత నిలిపివేస్తూ సదరు సంస్థకు ఉత్తర్వులు జారీ చేస్తారు.
ఈ బిల్లు అమలులోకి వస్తే తెలంగాణలో వేలాదిమంది వృద్ధులకు ఆసరా లభిస్తుంది. యావత్ దేశానికి తెలంగాణ ప్రభుత్వం తెస్తున్న ఈ బిల్లు స్పూర్తిదాయకంగా నిలుస్తుంది.