తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన కొత్త పార్టీ గురించి మాట్లాడారు. కానీ ఇప్పుడు కూడా పార్టీ ప్రకటించలేదు.
ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు మేడ్చల్ జిల్లాలోని అవుటర్ రింగ్ రోడ్ సమీపంలో గల మునీరాబాద్ వద్ద గల ఓ ఫంక్షన్ హాల్లో తన కొత్త పార్టీ ప్రకటిస్తానని చెప్పారు.
టిఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళేందుకు తెలంగాణతో సంబంధం తెంచుకుంది. కనుక తెలంగాణలో ప్రాంతీయ పార్టీ లేకుండా పోయింది. అందుకే తెలంగాణ రాష్ట్రం, ప్రజల కోసమే పనిచేసే పార్టీ అవసరమని నేను కొత్త పార్టీ స్థాపిస్తున్నాను.
ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏవిధంగా ప్రభుత్వంతో పోరాడుతామో, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలే కేంద్రంగా పని చేస్తాము. మా పార్టీ పక్కా ప్రాంతీయ పార్టీగానే ఉంటుంది. కనుక 95 శాతం తెలంగాణ కోసం, 5 శాతం జాతీయ అంశాల కోసం కేటాయిస్తాము.
మాకు ఎలాంటి భేషజాలు లేవు. తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రజల కోసం పని చేయాలనుకునే ప్రతీ ఒక్కరినీ కలుపుకుపోతాం. వారు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినా సరే!” అని కల్వకుంట్ల కవిత అన్నారు.