నేడు సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. క్రీస్టియన్ మతంలో కులాలు లేవు. కనుక హిందూ మతంలో నుంచి క్రీస్టియన్ మతంలోకి మారిన ఎస్సీలకు కులం వర్తించదని, ఎస్సీలకు లభిస్తున్న హక్కులు పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అలాగే వారికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కూడా వర్తించదని స్పష్టం చేసింది. ఈ సెక్షన్స్ హిందూ, బౌద్ధులు, సిక్కులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఏపీలో బాపట్ల జిల్లాలో పాస్టర్ చింతాడ ఆనంద్ వర్సస్ అక్కల రామిరెడ్డి కేసులో హైకోర్టు చెప్పిన తీర్పుని సుప్రీంకోర్టు సమర్ధించింది. చింతాడ ఆనంద్ పిర్యాదు మేరకు బాపట్ల పోలీసులు అక్కల రామిరెడ్డి తదితరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.
దానిపై వారు ఏపీ హైకోర్టు వెళ్ళగా క్రీస్టియన్ మతంలోకి మారిన ఎస్సీలకు కులం వర్తించదని, ఎస్సీలకు లభిస్తున్న హక్కులు పొందలేరని, కనుక ఈ సెక్షన్స్ కింద కేసు కూడా చెల్లదని కొట్టేసింది. దీనిపై చింతాడ ఆనంద్ సుప్రీంకోర్టులో సవాలు చేయగా అది కూడా హైకోర్టు తీర్పునే సమర్ధిస్తూ కేసు కొట్టివేసింది.
హిందూమతంలో వివిద కులాలకు చెందిన లక్షల మంది క్రీస్టియన్ మతంలో మారారు. ఇంకా మారుతూనే ఉన్నారు. కానీ వారిలో చాలా మంది తమ కులాలను, వాటి ద్వారా లభించే రిజర్వేషన్స్, వాటి ద్వారా లభించే సామాజిక గుర్తింపుని వదులుకోరు. అలాగే సదరు కులాల వారీగానే పెళ్ళిళ్ళు వగైరా చేసుకుంటుంటారు.
మరో విధంగా చెప్పాలంటే కులమే లేని క్రీస్టియన్ మతంలోకి కులాలను ప్రవేశపెట్టడమే కాకుండా కులాచారాలను కూడా ప్రవేశపెట్టారని చెప్పవచ్చు.
సుప్రీంకోర్టు తాజా తీర్పుతో హిందూమతం నుంచి క్రీస్టియన్ మతంలోకి మారిన ఎస్సీలతో సహా ఇతర కులాల వారికి కూడా ఇదే వర్తిస్తుంది. కనుక ఈ తీర్పుని ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకున్నట్లయితే రిజర్వేషన్స్ కోటా నుంచి వారందరి పేర్లు తొలగించాల్సి ఉంటుంది.