కల్వకుంట్ల కవిత రేపు శ్రీరామ నవమిని తన కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తంగా ఎంచుకున్నారు. రేపు ఉదయం ౮ గంటలకు సిద్ధిపేటలో కొత్త పార్టీ పేరు (తెలంగాణ ప్రజా జాగృతి), జెండా, అజెండా ప్రకటించబోతున్నట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్, బిజేపి, బీఆర్ఎస్ మూడు పార్టీలు చాలా బలంగా ఉన్నాయి.
వామపక్షాలు ఇంకా కొన్ని చిన్నా చితకా పార్టీలు ఉండనే ఉన్నాయి. కనుక రాష్ట్రంలో రాజకీయ శూన్యత లేదు. కానీ ఉందని భావిస్తూ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని స్థాపిస్తున్నారు.
ఆమె వచ్చే ఎన్నికలలోగా పార్టీని బలోపేతం అంటే ఇతర పార్టీల ప్రధాన నాయకులను ఆకర్షించడం, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని నిర్మించుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల వరకు అన్ని ఖర్చులు భరిస్తూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది.
ఈ టాస్కులన్నీ సమర్ధంగా పూర్తి చేయగలిగితే పార్టీ నిలబడినట్లే! ఆ తర్వాత మూడు ప్రధాన పార్టీలను ఎన్నికలలో ఢీ కొని ఓడించాల్సి ఉంటుంది.
కానీ ఆమె ప్రవేశంతో మూడు పార్టీలలో ఏది లాభపడుతుంది?దేనికి ఎక్కువ నష్టం జరుగుతుంది? అని ఆలోచిస్తే ఆమె బీఆర్ఎస్ పార్టీ నేతలను, కార్యకర్తలను ముందుగా చీల్చుకొని తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. కనుక ఆ పార్టీకి నష్టం కలుగుతుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలతో ఎన్నికలలో కూడా ఆ పార్టీ ఓట్లే చీలుతాయి. కనుక అప్పుడూ మరోసారి నష్టం తప్పదు.
ఆమెకు, బీఆర్ఎస్ పార్టీకి మద్య రాజకీయ పోరాటం సాగుతుంటే, దాని నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ లబ్ది పొందే అవకాశం ఉంది.
ఒకవేళ ఆమె కాంగ్రెస్, బిజేపి, బీఆర్ఎస్ మూడు పార్టీలలో ఏదో ఓ పార్టీతో రహస్య అవగాహన కుదుర్చుకుంటే వాటి నుంచి రక్షణ, సహాయ సహకారాలు లభిస్తాయి. కానీ ఆమె మూడింటినీ వ్యతిరేకించే అవకాశమే కనిపిస్తోంది. కనుక మూడు పార్టీలు కలిసి ఆమెను అణగద్రొక్కేసేందుకు ప్రయత్నించవచ్చు.
కనుక కల్వకుంట్ల కవిత కొత్త ప్రయాణం పూలబాట కానే కాదు. అడుగడుగునా ముళ్ళే ఉంటాయి. వాటిని తప్పించుకుంటూ ఆమె ముందుకు సాగుతూ తన లక్ష్యం (తెలంగాణ సిఎం కావడం) చేరుకోగాలరా లేదా? కాలమే చెపుతుంది.