తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల స్థానాలను 50 శాతం పెంచడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ఇప్పటికే పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు తగిన ప్రాతినిధ్యం లేదు.
ఈ ప్రతిపాదన అమలు చేస్తే ఇక దక్షిణాది రాష్ట్రాల ఓట్లు, సీట్లతో సంబంధం లేకుండానే ఉత్తరాది రాష్ట్రాల ఓట్లతోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటవుతుంది.
ఇది పార్టీలకు సంబందించిన సమస్య కాదు. దక్షిణాది రాష్ట్రాలకు సంబందించిన సమస్య! దీంతో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుంది కనుక ఇప్పుడే అందరూ కలిసి పోరాడి దీనిని అడ్డుకోవాలి,” అని అన్నారు.
లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల స్థానాలను 50 శాతం పెంచితే దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలలో టికెట్స్ ఆశిస్తున్న ఆశావాహులకు మరింత అవకాశం పెరుగుతుంది. కనుక ఎవరూ దీనిని వ్యతిరేకించకపోవచ్చు. ఇది రాజకీయ పార్టీలకు వేసిన ‘బిస్కట్’ వంటిదే అని చెప్పొచ్చు. ఈ బిస్కట్ వేసి ప్రాంతీయ పార్టీల నోళ్ళు మూయించవచ్చని కేంద్రం భావిస్తోందేమో?
కానీ ప్రాంతీయ పార్టీల కంటే ముందుగా జాతీయపార్టీ కాంగ్రెస్ తరపున సిఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం తెలపడం విశేషం. ఆయన చెప్పినట్లుగా దక్షిణాది ప్రమేయం లేకుండా కేవలం ఉత్తరాది ఓట్లు, సీట్లతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు కాగలిగితే కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయి.
మరి సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి ఈ విషయం తెలియజేసి మాట్లాడారా లేక యధాలాపంగా మాట్లాడారా?ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపితే సిఎం రేవంత్ రెడ్డి పోరాటం ఆలోచన విరమించుకోవాల్సి ఉంటుంది కదా?
దేశ భవిష్యత్‌ని నిర్దేశించే ఈ కీలకమైన అంశంపై సిఎం రేవంత్ రెడ్డి ఇంత చురుకుగా, ధైర్యంగా మాట్లాడారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు మాట్లాడుతుందో? దాని వైఖరి ఏమిటో?