భార్యభర్తల మద్య గొడవలలో అభంశుభం తెలీని చిన్నారులు బలైపోతూనే ఉన్నారు. హైదరాబాద్‌లో ఇలాంటి విషాద ఘటన జరిగింది.
కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేటలో స్రవంతి (30) వివాహిత భర్త వేధింపులు భరించలేక తన ఇద్దరు కుమారులు కార్తీక్ (12), కౌశిక్ (10)కి ఉరేసి చంపేసిన తర్వాత తాను కూడా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, వరంగల్ జిల్లాలో బోడమాణిక్యం, పదహార్ చింతల్ తండాలకు చెందిన బోడ ప్రవీణ్, స్రవంతి కొన్నేళ్ళ క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ హైదరాబాద్ వలస వచ్చి మూసాపేటలో నివాసం ఉంటున్నారు.
ప్రవీణ్ భవన నిర్మాణ కార్మికుడుగా, కారు డ్రైవరుగా పనిచేస్తుంటే స్రవంతి ఇళ్ళలో పనిమనిషిగా చేస్తుండేది. పెద్ద కొడుకు కార్తీక్ 6వ, చిన్న కొడుకు కౌశిక్ 4వ తరగతి చదువుకుంటున్నారు.
ఏడాది క్రితం స్రవంతి భర్త ప్రవీణ్‌కి మహేశ్వరి అనే ఆమెతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆమెతో వేరే కాపురం పెట్టిన సంగతి తెలుసుకున్నప్పటి నుంచి వారి మద్య గొడవలు మొదలయ్యాయి. దీనికి తోడు ప్రవీణ్ తాగివచ్చి భార్యను హింసించేవాడు. ఈ బాధలు భరించలేక స్రవంతి గ్రామపెద్దలకు పిర్యాదు చేయగా వారు మొన్న అదివారం నర్సంపేటలో పంచాయితీ పెట్టి ప్రవీణ్‌ని తీవ్రంగా మందలించారు.
ఇకపై భార్యాపిల్లలను బాగా చూసుకుంటానని వారికి మాటిచ్చిన ప్రవీణ్, ఈ అవమానం భరించలేక మళ్ళీ సోమవారం రాత్రి తాగివచ్చి భార్యను హింసించాడు. మర్నాడు భర్త పనికి వెళ్ళగానే స్రవంతి ఇద్దరి పిల్లలకి ఉరేసి, తను ఉరేసుకొని చనిపోయింది.
కానీ వారిని అతనే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తూ స్రవంతి బంధువులు ప్రవీణ్ ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రవీణ్‌ని అరెస్ట్ చేశారు.