తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ ప్రాజెక్టుపై మంత్రుల ఉపసంఘం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఈరోజు సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ ఈ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయాలు స్వీకరించాలని నిర్ణయించాము. నేటి నుంచి ఏప్రిల్ 15 వరకు ఈ ప్రాజెక్టుపై ప్రజలు తమ అభిప్రాయలు, అభ్యంతరాలు, సలహాలు, సూచనలు మాకు ఈమెయిల్ ద్వారా సమర్పించవచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు ఈమెయిల్ ద్వారా musirrdc@gmail.com కు ఏప్రిల్ 15లోగా పంపించవచ్చు. వాటన్నిటినీ పరిశీలించి పరిగణనలోకి తీసుకొని ముందుకు సాగుతాం,” అని తెలిపారు.
మూసీ ప్రాజెక్టులో భాగంగా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇళ్ళను తొలగించాలనుకున్నప్పుడే పెద్ద ఎత్తున్బ విమర్శలు, అభ్యంతరాలు వచ్చాయి. ఆ తర్వాత గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం గండిపేట మండలంలో అపార్ట్‌మెంట్‌లు సైతం కూల్చి వేస్తామని ప్రకటించడంతో వాటిలో నివసిస్తున్నవారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీ సరేసరి. ఈ ప్రాజెక్టుకి లక్షన్నర కోట్లు దేనికి? దీనిలో మీ కమీషన్ ఎంత? ఈ ప్రాజెక్టు పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం మానుకోండి,” అంటూ ప్రతీరోజూ తీవ్ర విమర్శలు చేస్తూనే ఉంది.
కనుక మూసీ ప్రాజెక్టు గురించి ఆలోచన మొదలుపెట్టినప్పుడే ప్రజలను, ప్రతిపక్షాలను సంప్రదించి ముందుకు సాగి ఉండి నేడు ఇన్ని విమర్శలు, ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవాల్సిన అవసరం ఉండేదే కాదు. ఇప్పటికైనా ప్రజాభిప్రాయాలు స్వీకరించాలనుకోవడం మంచిదే. కానీ వాటిని పరిగణనలోకి తీసుకొని తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటే మంచిది. కాదని మొండిగా ముందుకు వెళితే ప్రజాగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది.