రేపు ఏప్రిల్ 1 నుంచి దేశ వ్యాప్తంగా జనాభా లెక్కింపు కార్యక్రమం మొదటి దశ ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ నెలాఖరు వరకు ఈ మొదటి దశ లెక్కింపు కార్యక్రమం కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మే 11 నుంచి జూన్ 9 వరకు, ఏపీలో మే 1 నుంచి మే 30 వరకు సాగుతుంది.
జనాభా లెక్కలలో వార్షికాదాయం, స్థిరచరాస్తులతో సహా మొత్తం 33 అంశాలకు సంబంధించి వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. అన్ని వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ప్రభుత్వ, ప్రభుత్వేతర, ప్రైవేట్ సంస్థలకు ఈ వివరాలు లభించవు. ఈ వివరాలు కేవలం జనాభా లెక్కల కోసమే కనుక వీటి ఆధారంగా ఎటువంటి కేసులు, చర్యలు ఉండవు. సమాచార హక్కు కింద అడిగినా కూడా ఇవ్వరు. ప్రజలు తెలిపిన వివరాలన్నీ డిజిటల్ రికార్డ్ చేస్తారు. జన గణన ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత 2027లో కేంద్ర ప్రభుత్వం దేశంలో తాజా జనాభా ఎంతుంటుందో ప్రకటిస్తుంది.
ఒకవేళ ఎవరైనా ఇప్పటి నుంచే తమ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. దీని https://se.census.gov.in వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ప్రజలు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసిన తర్వాత 11 అక్షరాలు, అంకెల కూడిన ఒక ఐడీ వస్తుంది. జనాభా లెక్కలు తీసే సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు వారికి ఆ ఐడీ చూపిస్తే సరిపోతుంది. అవసరమైతే అప్పుడు కూడా మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు.