అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎవరితో సంప్రదించకుండా హడావుడిగా ఇరాన్‌తో యుద్ధం మొదలుపెట్టేశారు. నాలుగు వారాలుగా ఇరాన్ మీద బాంబుల వర్షం కురిపిస్తున్నా లొంగదీసుకోలేకపోయారు.
కనీసం ఇరాన్ అధీనంలో ఉన్న హోర్మూజ్ జలసంధి ని స్వాధీనం చేసుకోలేకపోయారు. ఇంకా ఎన్ని వారాలు, నెలలు యుద్ధం చేయాలో తెలియదు. కనుక యుద్ధం కొనసాగించలేక, అలాగని వెనక్కు తగ్గలేక ఆపసోపాలు పడుతున్నారు. రోజుకో మాట మాట్లాడుతూ నవ్వుల పాలవుతున్నారు.
మూడు నాలుగు రోజుల క్రితమే “అమెరికాలో పుష్కలంగా చమురు నిల్వలు ఉన్నందున హోర్మూజ్ జలసంధి తమకు అవసరం లేదని, ఎవరికైనా చమురు కావాలనుకుంటే మా దగ్గర కొనుక్కోండి లేదా హోర్మూజ్ వెళ్ళి మీ చావు మీరు చావండి,” అని అన్నారు.
కానీ ఇప్పుడు త్వరలో ఇరాన్ చమురు క్షేత్రాలు, విద్యుత్ కేంద్రాలు, మౌలిక వసతులపై మీద మరింత భీకరంగా దాడులు చేసి, ఆ దేశానికి మళ్ళీ పాత రాతి యుగం నాటి పరిస్థితి కల్పిస్తామని ట్రంప్ హెచ్చరించారు.
ట్రంప్ రోజుకో మాట్లాడుతూ అమెరికా ప్రతిష్టని కూడా మంట గలిపేస్తున్నారు. తన ఇగో కోసం లక్షల కోట్ల ప్రపంచ సంపదని ఆవిరి చేసేస్తూ యావత్ ప్రపంచంలో ఆర్ధిక సంక్షోభం సృష్టిస్తున్నారు.
ట్రంప్ వలన అమెరికాకు, ప్రపంచ దేశాలకు అపారమైన నష్టం జరుగుతున్నప్పటికీ, అమెరికాలో ప్రతిపక్ష డెమొక్రాట్ పార్టీ, ఐక్యరాజ్యసమితి, నాటో...ఏవీ అడ్డుకోలేకపోతున్నాయి.
అమెరికా ప్రజలతో సహా పలు మిత్రదేశాల ప్రజలు సైతం ‘నో కింగ్’ అంటూ ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయినా ట్రంప్ పట్టించుకోవడం లేదు. కనుక ట్రంప్ తీసుకునే ప్రతీ దుందుడుకు నిర్ణయానికి యావత్ ప్రపంచ దేశాలు మూల్యం చెల్లిస్తూనే ఉండక తప్పదు.
— Donald J. Trump (@realDonaldTrump) March 2, 2026