ఎమ్మెల్యే బాల్కా సుమన్‌ అరెస్ట్

May 30, 2026


img

బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే బాల్కా సుమన్‌ని నాంపల్లి పోలీసులు శనివారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌ నుంచి అరెస్ట్ చేశారు. అయితే ఆయనని అరెస్ట్ చేయబోతున్నారనే సమాచారం అందుకున్న పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌తో అక్కడకు వచ్చిన పోలీసులను ‘గో బ్యాక్’ అంటూ నినాదాలు చేస్తూ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మద్య తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కానీ పోలీసులు వారిని చెదరగొట్టి బాల్కా సుమన్‌ని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.    

సింగరేణి కార్యాలయం తగులబెట్టేయాలంటూ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలపై పిర్యాదులు అందడంతో పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. కానీ బాల్క సుమన్ తెలంగాణ భవన్‌లో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

కాసేపు  తోపులాటల తర్వాత ఆయనే బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన తర్వాత పోలీసులకు లొంగిపోయారు. ఆయనని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ ప్రశ్నించిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అప్పటికి కోర్టు సమయం దాటిపోతుంది కనుక న్యాయమూర్తి ఇంటి వద్ద ఇరు పక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది.

కానీ పోలీసులు ముందే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు కనుక ముందుగా రెండు వారాల జ్యూడిషియల్ రిమాండ్ విదించే అవకాశం ఉంటుంది.

ఒకవేళ బెయిల్‌ పిటిషన్‌కు న్యాయమూర్తి అనుమతిస్తే సోమవారం కోర్టులో విచారణ జరిపే అవకాశం ఉంటుంది.


Related Post