ఢిల్లీలో ఓ చిన్న స్టార్ట్ అప్ కంపెనీ ప్రారంభం అయ్యింది. దాని పేరు క్యారీ మ్యాన్. పేరుకి తగ్గట్లుగానే షాపింగ్ మాల్స్‌లో షాపింగ్ చేసి బ్యాగులు మోసుకోలేక అవస్థ పడుతున్న మహిళలు, వృద్ధులు ఎవరికైనా సరే వారు సాయపడతారు.
వారి బ్యాగులు మోసుకువెళ్ళి కార్లో, అవసరమైతే ఇంట్లో పెడతారు. అవసరమైతే ఎండా, వానలప్పుడు గొడుగు పట్టుకొని వెంటనడుస్తారు. ఫోన్ ఛార్జింగ్ చేసి పెడతారు. ఇంకా ఇలాంటి చిన్న చిన్న సేవలు చేసి పెట్టేందుకు వారు గంటకు రూ.178లు తీసుకుంటారు.
దూరం నుంచే గుర్తుపట్టేందుకు వీలుగా క్యారీమ్యాన్ అని వ్రాసున్నఎర్ర రంగు చొక్కాలు ధరిస్తారు. షాపింగ్ మాల్స్ సమీపంలో అందరికీ అందుబాటులో ఉంటారు.
ఢిల్లీ ప్రజలకు వీరి సేవలు నచ్చడంతో విరివిగా వాడేసుకుంటున్నారు. దీంతో క్యారీ మ్యాన్ కాన్సెప్ట్ సూపర్ హిట్ అయ్యింది. ఈ వార్త, ఈ బిజినెస్ అప్పుడే దేశమంతా పాకిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కనుక త్వరలోనే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ‘క్యారీ మ్యాన్’ వంటి సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తాయి. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందంటే ఇదేగా?
అయితే ఈ ఐడియా కొత్తదేమీ కాదు. మన దేశంలో రైల్వే స్టేషనలు, బస్టాండ్లలో కూలీల రూపంలో ఎప్పటి నుంచో ఉంది.
ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు సైకిల్ రిక్షా తొక్కేవారు ఇలాగే కూరగాయల, నిత్యావసర సరుకుల సంచీలు మోసుకు వచ్చి రిక్షాలో పెట్టుకొని ఇంటి వద్ద దించేవారు కదా?
నేడు స్విగ్గీ, జొమోటో, అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ర్యాపిడో, ఊబర్, ఓలా వంటి సంస్థలలో పనిచేస్తున్న గిగ్ వర్కర్స్ కూడా ఇవే సేవలు వేర్వేరు రకాలుగా అందిస్తున్నారు కదా?
కనుక క్యారీ మ్యాన్స్ కూడా అటువంటిదే అయినప్పటికీ కాస్త భిన్నంగా ఉంది కనుక సూపర్ హిట్ అయ్యింది.