తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, రైతుల కోసం ప్రత్యేకంగా తెలంగాణ రైతు విద్యుత్ సరఫరా పంపిణీ సంస్థ (టిజిఆర్‌పిడిసిఎల్) ఏర్పాటు చేస్తోంది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు నుంచి టిజిఆర్‌పిడిసిఎల్ పని చేస్తుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
అయితే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి ఓ లేఖ వ్రాశారు. తెలంగాణ ప్రభుత్వం రైతు డిస్కం ఏర్పాటుకి అనుమతి కోరుతూ సమర్పించిన దరఖాస్తుని తిరస్కరించాలని దానిలో కోరారు.
దరఖాస్తులో ఆర్ధిక అంశాలు ప్రస్తావిస్తూ డిస్కం ఏర్పాటుకి అనుమతి కోరడంపై హరీష్ రావు అనుమానాలు వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించిందని, తత్ఫలితంగా వారి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
రైతులు, రైతు సంఘాలు, విద్యుత్ పంపిణీ సంస్థలు రైతు డిస్కం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరనప్పుడు ఎందుకు ఏర్పాటు చేస్తోందని హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకే ఇటువంటి అనూహ్యమైన పనులు చేస్తోందన్నారు.
ప్రభుత్వం నిర్ణయంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. శాసనసభలో బిల్లు పెట్టి చర్చించకుండానే ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడాన్ని హరీష్ రావు తప్పు పట్టారు. కనుక ప్రభుత్వ దరఖాస్తుని తిరస్కరించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి హరీష్ రావు కోరారు.