హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ గతంలో తీసుకున్న పాత బకాయిలకు ఏడాదికి 9.5 శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తోంది. ఇప్పుడు మెట్రో సంస్థ ఎల్&టి నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేతికి వచ్చినందున దాని అప్పులు, వడ్డీ భారం ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది.
కనుక అధిక వడ్డీతో ఉన్న రుణభారం వదిలించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైల్వేశాఖకు అనుబంధం సంస్థ రైల్వే స్టేషన్ ఫైనాన్స్ కార్పోరేషన్ (ఐఆర్ఎఫ్‌సి)తో చర్చలు జరిపి 20 ఏళ్ళకు దీర్గకాలిక రుణంగా రూ.13,527 కోట్లు తీసుకుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం 3.5 శాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది.
ఈ మేరకు హైదరాబాద్ మెట్రో తరపున ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్&టి మెట్రో రైల్ (హైదరాబాద్) తరపున ఆ సంస్థ ఎండీ కేవీబీ రెడ్డి, ఐఆర్ఎఫ్‌సి తరపున ఆ సంస్థ సీఎండీ, సీఈవో మనోజ్ కుమార్ దుబే సోమవారం ఢిల్లీలో త్రైపాక్షిక ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
కనుక ప్రభుత్వంపై ఈ రుణ ఒత్తిడితో పాటు వడ్డీ భారం కూడా తగ్గుతుంది. ఈ రీ ఫైనాన్సింగ్ ద్వారా హైదరాబాద్ మెట్రో (మొదటి దశ) ఆర్ధిక సమస్యలు, ఒత్తిళ్ళ నుంచి విముక్తి లభించినందున, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ పనులపై దృష్టి పెట్టగలుగుతుంది.