తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు రైల్వే బోర్డు నో!

June 05, 2026
img

హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్ళలో ప్రజలకు ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతించాలంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని రైల్వే బోర్డు తిరస్కరించింది. ఈ మేరకు లిఖిత పూర్వకంగా తెలియజేసింది.

రైల్వే బోర్డు లేఖలో, “ఇప్పటికే ఎంఎంటీఎస్ రైళ్ళ నిర్వహణ వలన చాలా నష్టపోతున్నాం. 2024-25లో వాటి నిర్వహణకు రూ. 179 కోట్లు ఖర్చయితే రూ.16.81 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. ఒక్క ఏడాదిలోనే రూ.162 కోట్లు నష్టం వచ్చింది. 

తెలంగాణ ప్రభుత్వం ఆ నష్టాన్ని భరించి, ద.మ.రైల్వేకి బాకీ ఉన్న రూ.490 కోట్లు కూడా చెల్లిస్తే మీ ప్రతిపాదన గురించి ఆలోచిస్తాము. తెలంగాణ ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఆర్ధిక హామీలు ఇస్తే తప్ప మీ ప్రతిపాదనని అంగీకరించలేము,” అని స్పష్టం చేసింది. 

ఎంఎంటీఎస్ రైళ్ళలో ప్రజలు ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతించినట్లయితే ఆ మొత్తం మేము చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. రద్దీకి తగ్గట్లు ఎంఎంటీఎస్ రైళ్ళని పెంచి జూన్‌ 2 నుంచి దీనిని అమలుచేయాలని విజ్ఞప్తి చేసింది. 

కానీ రైల్వే బోర్డు అందుకు నిరాకరిస్తూ ముందు రూ. 490 కోట్లు బకాయిలు చెల్లించాలని చెప్పడం తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద షాకే అని భావించవచ్చు. హైదరాబాద్‌ మెట్రో ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలోనే నడుస్తోంది కనుక దానిలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే నగర ప్రజలు చాలా సంతోషిస్తారు కదా?

Related Post