ఇక ఆయిల్ పామ్ సాగు, పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ

July 19, 2026
img

దశాబ్దాలుగా వరి, జొన్న, పత్తి, మిర్చి వంటి సాంప్రదాయ పంటలకే పరిమితమైన తెలంగాణ రైతాంగం ఇప్పుడు కొత్త రకం పంటలకు మొగ్గు చూపుతున్నారు. 

తక్కువ ఖర్చుతో ఏళ్ళ తరబడి దిగుబడినిచ్చే ఆయిల్ పామ్‌ సాగుని ప్రభుత్వం కూడా ప్రోత్సాహిస్తుండటంతో పలు జిల్లాలలోని ఆయిల్ పామ్ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. వాటి చుట్టుపక్కల ప్రాంతాలలో రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. 

ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అప్పారావుపేటలో గంటకు 90 టన్నులు సామర్ధ్యం కలిగిన ఆయిల్ పామ్ పరిశ్రమ ఉంది. అదేవిధంగా ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో గంటకు 30 టన్నులు, సిద్ధిపేట జిల్లా నర్మెటలో గంటకు 30 టన్నులు సామర్ధ్యం కలిగిన ఆయిల్ ఫామ్ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇవి కాక రాష్ట్రంలో మరో ఆరు ఏర్పాటు కాబోతున్నాయి. 

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని అంజనాపురంలో ఏర్పాటు అయిన గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ ఆయిల్ పామ్ పరిశ్రమని సిఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభోత్సం చేయనున్నారు. 

రూ.300 కోట్లు పెట్టుబడితో ఏర్పాటైన ఈ పరిశ్రమలో సుమారు 100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, చుట్టుపక్కల ప్రాంతాలలో ఆయిల్ పామ్‌ సాగు చేస్తున్న 700 మంది రైతులకు ఉపాధి లభించనుంది. ఈ పరిశ్రమకు కేటాయించిన  113.5 ఎకరాలలో ఇప్పటికే మూడు లక్షల ఆయిల్ పామ్ మొక్కలు పెంచుతున్నారు. ఇక్కడే నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి కూడా చేస్తున్నారు. 

భద్రాద్రి, ఖమ్మం, సంగారెడ్డి జిల్లాలలో 12 మండలాలలో రైతులు ఆయిల్ పామ్ చెట్లు పెంచుతున్నారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థ వారికి 1.40 లక్షల మొక్కలు సరఫరా చేసింది. 

Related Post