మెగాస్టార్ చిరంజీవి అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ ఓ యూట్యూబ్ ఛానల్ తప్పుడు ప్రచారం చేసినందుకు జూబ్లీహిల్స్ పోలీసులు దాని నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. మిర్యాల రామకృష్ణ అనే న్యాయవాది జూబ్లీహిల్స్ పోలీసులకు పిర్యాదు చేశారు.
సదరు యూట్యూబ్ ఛానల్ చిరంజీవి ఆరోగ్యం గురించి తప్పుడు ప్రచారం చేసేందుకు అయన మార్ఫింగ్ వీడియోని సృష్టించి మరీ సోషల్ మీడియాలో వైరల్ చేసిందని అయన పిర్యాదు చేశారు. దీని వలన చిరంజీవికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవలసివస్తోందని రామకృష్ణ పేర్కొన్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో, సమాజంలో అంత ఉన్నత స్థానంలో ఉన్న చిరంజీవి గురించి ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసి, ఆయన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని మిర్యాల రామకృష్ణ పిర్యాదులో కోరారు.
ఆయన పిర్యాదు, సమర్పించిన ఆడియో, వీడియో సాక్ష్యాధారాల సాయంతో సదరు యూట్యూబ్ ఛానల్‌ని గుర్తించి, దాని నిర్వాహకులను పోలీసులు విచారించబోతున్నారు.