తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తట్టెడు మట్టి తీయలేదంటూ బీఆర్ఎస్ పార్టీ నిత్యం విమర్శిస్తుంటుంది. కానీ పదేళ్ళు అధికారంలో ఉన్నా అది పూర్తిచేయకుండా వదిలేసిన పనులెన్నో. వాటిలో సీతారామ ఎత్తిపోతల పథకం కూడా ఒకటి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలలో 1.31 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందించేందుకు సత్తుపల్లి మండలం యాతాలకుంట వద్ద సొరంగం నిర్మాణ పనులు వేగవంతం చేసింది.
ఉన్నతాధికారులు, నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, కాంట్రాక్ట్ కంపెనీ ఇంజనీర్లు, వందలాది మంది కార్మికులు సమిష్టి కృషితో 1.781 కి.మీ పొడవైన సొరంగం నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి.
బంకమట్టితో నిండిన అత్యంత క్లిష్టమైన ఈ ప్రదేశంలో రేయింబవళ్ళు పనిచేస్తూ కేవలం 16 నెలల్లోనే సొరంగం నిర్మాణం దాదాపు పూర్తి చేశారు. ఇది అందుబాటులోకి వస్తే సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పలు గ్రామాలకు తాగు, సాగు నీరు లభిస్తుంది.