ఇటీవల ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు పెట్రోల్, డీజిల్ సంక్షోభం ముంచుకొస్తోంది. కనుక వాడకం తగ్గించుకోమని దేశ ప్రజలకు సలహా ఇచ్చారు. ఆయన స్వయంగా తన కాన్వాయ్‌లో కార్ల సంఖ్యని సగానికి తగ్గించుకున్నారు. కేంద్ర మంత్రులు, దేశంలో ఎన్డీయే, బిజేపి ముఖ్యమంత్రులు కూడా వెంటనే కాన్వాయ్ తగ్గించుకున్నారు.
మరి ఈ విషయంలో ప్రధాని మోడీని తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కూడా తగ్గించుకుంటారా లేదా? అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటే అయన కూడా తగ్గించుకున్నారు. శనివారం కేవలం మూడు కార్ల కాన్వాయ్‌తో సిఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి నుంచి సచివాలయం చేరుకున్నారు. దారిలో ఎక్కడా ట్రాఫిక్ ఆపకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా వారితో పాటు కలిసి ప్రయాణించారు. ఆయన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై ఇతర వాహనాలను కాస్త పక్కగా వెళ్ళేలా చేశారు అంతే.
బిజేపిని ప్రధాని మోడీని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంటుంది. సిఎం రేవంత్ రెడ్డి కూడా ప్రధాని మోడీ అసమర్ద పాలనతో దేశాన్ని భ్రష్టు పట్టించేస్తున్నారని మొన్ననే విమర్శించారు. కానీ పెట్రోల్, డీజిల్ పొదుపు చేయాలనే సూచన మంచిదే కనుక దానిని పాటిస్తున్నారు. సిఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ తగ్గించుకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తగ్గించుకోక తప్పదు కదా!