గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా చేసిన ‘పెద్ది’కి మొదట వారం పది రోజులు టికెట్ ఛార్జీలు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిస్తూ జీవో జారీ చేసింది. కానీ తెలంగాణ ప్రభుత్వం పెద్ది విజ్ఞప్తిని పట్టించుకోలేదు.
దీంతో పెద్ది నిర్మాతలు హైకోర్టుని ఆశ్రయిస్తే అక్కడా ఎదురుదెబ్బే తగిలింది. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు వెకేషన్ బెంచ్ జూన్ 6న తదుపరి విచారణ చేపడతామని వాయిదా వేసింది.
కానీ పెద్ది జూన్ 4న విడుదల కాబోతోంది. ఒక రోజు ముందుగా అంటే జూన్ 3న ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన మూడు నాలుగు రోజుల విచారణ చేపట్టినా టికెట్ ఛార్జీల పెంచడం నిర్మాతల హక్కు కాదని, ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉండాలనే చెప్పే అవకాశం ఉంటుంది తప్ప వెంటనే టికెట్ ఛార్జీలు పెంచాల్సిందేనని ప్రభుత్వాన్ని ఆదేశించదు.
కనుక పెద్ది నిర్మాతలు హైకోర్టులో వేసిన ఆ పిటిషన్ వాపసు తీసుకొని ప్రస్తుతం ఉన్న ఛార్జీలతోనే సినిమా ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు.
ఏ పెద్ద సినిమాకైనా తెలంగాణలో వచ్చే ఆదాయం కీలకం. కానీ పెద్దికి ఆ అదనపు ఆదాయం లేకుండా పోయింది.
కానీ పెద్దిపై చాలా భారీ అంచనాలు ఉన్నందున దేశవ్యాప్తంగా, ఓవర్సీస్‌లో కూడా భారీగా కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంటుంది. కనుక దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే భావించవచ్చు.