మున్సిపల్ ఎన్నికలలో నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో ‘మేయర్ పీఠం’ ఎవరిది? అనే సందిగ్ధం మొదలైంది. కానీ నేడు నిజామాబాద్ బిజేపి ఎంపీ ధర్మపురి అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ, “నిజామాబాద్ పీఠం వాళ్ళనే తీసుకోనీయండి. కాంగ్రెస్, మజ్లీస్ పార్టీలు చేతులు కలుపుతాయని మేము ముందు నుంచే చెపుతున్నాం. ఇప్పుడు మేయర్ పదవి కోసం రెండూ చేతులు కలుపుతున్నాయి. ప్రతిపక్షంలో కూర్చోవడానికి మాకేమీ అభ్యంతరం లేదు. అవసరమైతే తప్పకుండా కూర్చుంటాము,” అని అన్నారు అన్నారు. అంటే మేయర్ పీఠంపై ఎక్స్ అఫీషియో లెక్కలు చూసుకున్నాకనే ఆయన ఈ మాట అని ఉండవచ్చు.
నిజామాబాద్ కార్పోరేషన్లో 60 సీట్లున్నాయి. వాటిలో బిజేపి అత్యధికంగా 28 గెలుచుకోగా, కాంగ్రెస్: 17, మజ్లీస్: 14, బీఆర్ఎస్: 1 సీటు గెలుచుకున్నాయి. మేయర్ పీఠం దక్కాలంటే కనీసం 31 సీట్లు అవసరం.
బిజేపికి ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమురయ్య కలిపి నాలుగు ఓట్లున్నాయి. కనుక వారి ఓట్లతో కలిపితే బిజేపికి 32 ఓట్లు ఉన్నాయి.
కానీ కాంగ్రెస్ (17), మజ్లీస్ (14), బీఆర్ఎస్ (1) కలిపితే వారి కూటమికి 32 ఓట్లు ఉన్నాయి. ఇవి కాక ఇద్దరు ఎమ్మెల్యేలు (పీసీసీ అధ్యక్షుడు) మహేష్ కుమార్ గౌడ్, భూపతి రెడ్డి ఓట్లున్నాయి. కనుక కూటమికి 34 ఓట్లు అవుతాయి. వీరిలో ఏ ఒక్క పార్టీ క్రాస్ ఓటింగ్ చేసే అవ ఆకాశం కూడా లేదు. అందువల్లే నిజామాబాద్ మేయర్ పీఠం కాంగ్రెస్ కూటమికి అప్పగించేసి, ప్రతిపక్షంలో కూర్చుకునేందుకు బిజేపి సిద్ధపడుతోందనుకోవచ్చు.
అయితే కాంగ్రెస్, మజ్లీస్ చేతులు కలుపుతాయని ముందే తెలిసి ఉన్నందున వాటికి ఈ అవకాశం దక్కకుండా చేసేందుకు ధర్మపురి అర్వింద్ నేతృత్వంలో బిజేపి గట్టిగానే ప్రయత్నించింది. కానీ కుదరలేదు.