తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 26 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నెల 23న మంత్రివర్గ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర ఆర్ధిక మంత్రి, డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఈనెల 28న శాసనసభలో 2026-27 ఆర్ధిక సం.లకు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండున్నరేళ్ళు గడిచిపోయాయి. ఇటీవల మున్సిపల్ ఎన్నికలలో సంక్షేమ పధకాలు, సూపర్ సిక్స్ ఎన్నికల హామీలు, బకాయిల గురించి బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలదీసింది. అయినా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
కానీ బీఆర్ఎస్ పదేపదే చేస్తున్న ఈ విమర్శలు ప్రజలకు బాగానే చేరుతాయి. ఇంకా జిహెచ్‌ఎంసి, ఖమ్మం తదితర కార్పోరేషన్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉంది. వాటిలో కూడా కాంగ్రెస్ పార్టీ గట్టెక్కగలిగితే శాసనసభ ఎన్నికలకు వరకు నిశ్చింతగా పాలన చేసుకోవచ్చు. కనుక ఈసారి రాష్ట్ర బడ్జెట్‌లో సంక్షేమ పధకాలు, సూపర్ సిక్స్ ఎన్నికల హామీలకు ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం ఉండవచ్చు.