ప్రతీ 5-6 నెలలకో లేదా ఏడాదికో దేశంలో ఏదో ఓ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఈ ఏడాది మే నెలాఖరులోగా కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలు, జూన్ 15న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిల శాసనసభల పదవీ కాలం ముగుస్తుంది.
కనుక మార్చి రెండవ లేదా మూడవ వారంలో ఈ నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరిల శాసనసభ ఎన్నికల షెడ్యూల్ జారీ చేయబోతున్నట్లు కేంద్ర ఎన్నికల కమీషన్ తెలిపింది.
ఇప్పటికే ఎన్నికల కమీషన్ సభ్యులు ఆయా రాష్ట్రాలలో పర్యటిస్తూ అధికార, ప్రతిపక్ష పార్టీలతో, ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశమవుతున్నారు. రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన, అనుకూలమైన తేదీలలో ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల కమీషన్ షెడ్యూల్ రూపొందించి ప్రకటిస్తుంది.
ఈసారి తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కోలీవుడ్ నటుడు విజయ్ పార్టీ టివికే పోటీ చేయబోతోంది. తమిళనాడు సిఎం స్టాలిన్ నేతృత్వంలోని అధికార డీఎంకే, పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో మళ్ళీ అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గెలిచి అధికారంలోకి రావాలని బిజేపి కూడా చాలా పట్టుదలగా ఉంది. కనుక ఈ రెండు రాష్ట్రాలలో ఎన్నికలు రసవత్తరంగా సాగబోతున్నాయి.