స్విగ్గీ, జొమోటో, బ్లింకిట్ తదితర సంస్థల మద్య పోటీ విపరీతంగా పెరిగిపోవడంతో కేవలం 10 నిమిషాలలోనే డెలివరీ ఇవ్వాలనే కొత్త ఐడియా పుట్టింది. దానిని ఎత్తివేయాలని కోరుతూ గిగ్ వర్కర్లు ఇటీవల సమ్మె చేశారు.
దేశంలో నగరాలు, పట్టణాలు, పల్లెలు ఎక్కడ చూసినా నానాటికీ వాహనాలు, ట్రాఫిక్ పెరిగిపోతూనే ఉంది. కనుక10 నిమిషాలలోనే డెలివరీ ఇవ్వాలంటే తమ ప్రాణాలు పణంగా పెట్టి, కొన్నిసార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాల్సి వస్తోందని గిగ్ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
వారి మొర సదరు సంస్థలు విన్నాయో లేదో తెలీదు కానీ కేంద్ర మంత్రి మన్ సుక్ మాండవీయ దృష్టికి వచ్చింది. అయన ఆయా సంస్థల ప్రతినిధులతో మాట్లాడి ఈ 10 నిమిషాల డెలివరీ నిబంధన తొలగించాలని ఆదేశించారు.
ఆయన ఆదేశం మేరకు కొన్ని సంస్థలు వెంటనే ఆ నిబంధన ఎత్తివేయగా మిగిలినవి కూడా నేడో రేపో ఎత్తివేయనున్నాయి. కనుక ఇకపై ఆహారం, నిత్యావసర వస్తువులు ఆర్డర్ పెడితే వీలుంటేనే 10 నిమిషాలలో డెలివరీ అవుతాయి. లేకుంటే కొంత సమయం పడుతుంది. ప్రజలు కూడా ఈ నిబందన వలన గిగా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యని గుర్తించి వారికి సహకరిస్తే బాగుంటుంది.