కోలీవుడ్ హీరో విజయ్ దళపతికి గొప్ప మాస్ ఫాలోయింగ్ ఉంది. బహుశః ఆ ధైర్యంతోనే సినిమాలకు గుడ్ బై చెప్పి టివికే పార్టీతో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించారు. ఈ ఏప్రిల్-మే నెలల్లో శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశారు.
నేడు తంజావూర్‌లో ఓ భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ, “మిగిలిన పార్టీలకు ఇవి కేవలం ఎన్నికలు మాత్రమే. కానీ నాకు మాత్రం ఇవొక రకమైన భావోద్వేగం. తమిళ ప్రజలు ఏవిధంగా చెన్నై సీఎస్కే టీమ్‌కి విజిల్స్ వేసి ప్రోత్సహించి గెలిపిస్తుంటారో, అదేవిధంగా ఈసారి టివికే పార్టీకి విజిల్ (ఎన్నికల చిహ్నం) వేసి తప్పకుండా గెలిపిస్తారని నమ్ముతున్నాను. ఈ ఎన్నికలలో మా పార్టీ గెలిచి అధికారంలోకి రావడం ఖాయమే. ఢిల్లీ టీమ్ బిజేపితో సహా అన్నిటినీ టివికే తుడిచిపెట్టేస్తుంది,” అంటూ విజయ్ తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్తో ప్రకటించారు.
ఇదివరకు కమల్ హాసన్ కూడా ఇలాగే తనకున్న ప్రజాదరణ, అభిమానులను నమ్ముకొని సొంత పార్టీతో రాజకీయాలలోకి దిగి చేతులు కాల్చుకున్నారు. రజనీకాంత్ కూడా రాజకీయాలలోకి రావాలనుకున్నారు. కానీ కమల్ హాసన్‌కి ఎదురైన చేదు అనుభవాలు చూసి రాజకీయ ఆలోచనలు విరమించుకున్నారు. కానీ ఇప్పుడు విజయ్ రాజకీయాలలో తన అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. తొలివిడతలోనే విజయం సాధించి అధికారంలోకి రావడం చాల కష్టం. కానీ వస్తే మాత్రం ఆయనకు ఇక తిరుగే ఉండదు.