రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా చేస్తున్న ‘పెద్ది’ సినిమా రన్ టైమ్ మూడు గంటలపైనే అంటూ నిన్నటి నుంచి మీడియాలో ఒకటే పుకార్లు, కధనాలు వస్తున్నాయి. వాటిపై పెద్ది టీమ్ స్పందిస్తూ, “పెద్ది సినిమాలో 50 శాతం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం మిగిలిన భాగం షూటింగ్ జరుగుతోంది.
పెద్ది షూటింగ్ పూర్తి కాకుండానే అప్పుడే రన్ టైమ్ మూడు గంటలంటూ వార్తలు వస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అవన్నీ పుకార్లే. సినిమా షూటింగ్, ఎడిటింగ్ మొత్తం పూర్తయితే తప్ప రన్ టైమ్ ఖరారు కాదు. కనుక పెద్ది గురించి వస్తున్న ఇటువంటి పుకార్లను నమ్మవద్దు,” అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇటీవల విడుదల చేసిన ‘రయ్ రయ్ రారా’ పాటకు మంచి స్పందన వస్తోంది. ఈ పాటకు డాన్స్ చేయాల్సినప్పుడు రామ్ చరణ్ జ్వరంతో బాధపడుతున్నారు. కనుక తర్వాత మరో రోజు షూటింగ్ పెట్టుకుందామని చెప్తున్నా రామ్ చరణ్ వినలేదని, జ్వరంతోనే ఆ పాటకి డాన్స్ చేశారని దర్శకుడు బుచ్చిబాబు కొత్త విషయం బయటపెట్టారు. అంత జ్వరంలో కూడా రామ్ చరణ్ అద్భుతంగా డాన్స్ చేశారని మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్నారు.