బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నేడు బెయిల్‌పై ఆదిలాబాద్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి తోడ్కొని పోయారు.
క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సమయంలో బాల్క సుమన్, అనుచరులు రోడ్డుపై బైటాయించి నిరసనలు తెలిపారు. ఆ సమయంలో అటుగా వచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామి కారుపై దాడి చేశారు. ఆ కేసులోనే పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా రెండు వారాలు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఈలోగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకొని రెండు రోజులు ఆలస్యంగా బయటకు వచ్చారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, “నన్ను 16 రోజులు జైల్లో ఉంచారు. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా వివేక్? నా కొడుకు పుట్టిన రోజునాడు నన్ను జైలు నుంచి విడుదలకాకుండా కుట్రలు చేశారు. కానీ మా లాయర్లు గట్టిగా వాదించి నన్ను జైలు నుంచి విడిపించారు,” అని అన్నారు.