అవును! ఇంటర్ విద్యార్ధినే గర్భం దాల్చింది... బిడ్డని ప్రసవించింది! పుట్టిన శిశువుని చెత్తబుట్టలో పడేసి వెళ్ళిపోయింది! దేశంలో నేటికీ మారుమూల పల్లెటూర్లలో ఈ వయసులో పెళ్ళిళ్ళు, పిల్లలు కనడం జరుగుతూనే ఉంది. కానీ పట్నంలో ఇంటర్ చదువుతున్న విద్యార్ధిని బిడ్డని కనడమే ఆశ్చర్యమనుకుంటే, నలుగురు ఏమనుకుంటారో అనే భయంతో కళ్ళు తెరవని పసిగుడ్డుని నిర్దాక్షిణ్యంగా ప్లాస్టిక్ కవర్లో పెట్టి చెత్తబుట్టలో పడేయడం చాలా దారుణమే కదా?
ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగింది. సదరు విద్యార్ధిని కేజీబీవీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు వ్రాస్తోంది. బుధవారం పరీక్ష వ్రాసి ఇంటికి చేరుకున్నాక నొప్పులు మొదలయ్యాయి. వైద్య పరీక్ష కోసం తల్లితో కలిసి స్థానిక స్కానింగ్ సెంటర్‌కు వెళ్ళినప్పుడు బాత్రూములో బిడ్డకు జన్మనిచ్చింది.
ఇది గమనించిన ఆమె తల్లి ఆ పసికందుని ప్లాస్టిక్ కవరులో పెట్టి అక్కడే ఉన్న చెత్తబుట్టలో పడేసిన అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
చెత్తబుట్టలో నుంచి బిడ్డ ఏడుపు వినిపించడంతో షాక్ అయిన స్కానింగ్ సెంటర్ సిబ్బంది బిడ్డని బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణలో వివాహితుడైన ఆ బాలిక దగ్గర బంధువు ఆమెకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నట్లు కనుగొన్నారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు అరెస్ట్ చేశారు.