అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం అప్పుడే భారత్ వరకు వచ్చేసింది. దేశవ్యాప్తంగా గృహ వినియోగ వంట గ్యాస్, వాణిజ్య వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధర ఒకేసారి రూ.60లు పెరిగింది.
హోటల్స్ వంటి వాణిజ్య అవసరలాకు వాడే గ్యాస్ సిలిండర్ ధర రూ.115 చొప్పున పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచే పెంచిన ఈ ధరలు అమలులోకి వచ్చాయి. అయితే ఉజ్వల్ పథకం ద్వారా అందించే రాయితీ సిలిండర్లకు ఈ పెంపు వర్తించదని పేర్కొన్నాయి.
వంటగ్యాస్ అదనపు భారం ఎలాగూ భరించక తప్పదు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినందున వాటిని వినియోగించే సంస్థలు తమ ఉత్పత్తులు, సేవల ధరలు ఆ మేరకు పెంచకుండా ఉండవు. కనుక ఈ భారం కూడా సామాన్య ప్రజలపైనే పడుతుంది. అంటే రెండు రకాల సిలిండర్ ధరల పెంపుకి సామాన్య ప్రజలే మూల్యం చెల్లించాలన్న మాట!
గ్యాస్ ధరలు పెంచిన చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెంచకుండా ఉండవు. ఎందుకంటే ధరలు పెంచేందుకు ఇలాంటి బలమైన కారణం మళ్ళీ దొరకకపోవచ్చు కనుక!