వరలక్ష్మీ శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో నటించిన ‘సరస్వతి’ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది.
దానిలో ఓ జర్నలిస్ట్ “నా కథని వరలక్ష్మీ దాదాపు రేప్ చేసిందని అర్థం వచ్చినట్లు ఇటీవల సాయి మాధవ్ బుర్రా కామెంట్ చేశారు. దీనికి మీ సమాధానం ఏమిటి?” అని ఆమెను ప్రశ్నించారు.
వరలక్ష్మీ సమాధానం చెపుతూ, “ఇది ఆయన కథే. కానీ చాలా ఏళ్ళ క్రితం వ్రాసినందున ఇప్పటి పరిస్థితికి సరిపోదు. ఆయన ఈ కథ పట్టుకొని కొంతమందిని కలిశారు. కానీ కధ నచ్చకపోవడంతో ఎవరూ తీసుకోలేదు. అదే కథని ఆయన నాలుగు లైన్లలో వాయిస్ నోట్ రూపంలో నాకు పంపారు.
ఆ కథ కాన్సెప్ట్ నాకు నచ్చింది. కనుక ఆయనతో ఫార్మాలిటీలన్నీ పూర్తి చేసి తీసుకున్నాను. కానీ నేటి పరిస్థితికి తగినట్లు క్లైమాక్స్ మార్చాలని కోరినా ఆయన ఒప్పుకోలేదు. మేము ఆయనకు డబ్బు చెల్లించే ఆ కథ తీసుకున్నాము. కనుక ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కథలో కొన్ని మార్పులు చేసి దాంతో ఈ సరస్వతి సినిమా తీశాము.
ఆయనంటే నాకు చాలా గౌరవం. అందుకే సినిమా టైటిల్స్‌లో కథా రచయితగా ఆయన పేరే వేశాము తప్పితే నా పేరు వేసుకోలేదు. సినిమా బాగుందని అందరూ చెప్తున్నారు. అయినా ఆయన ఈవిధంగా మాట్లాడటం సబబు కాదు,” అని వరలక్ష్మీ శరత్ కుమార్ మర్యాదగానే సాయి మాధవ్ బుర్రాకు సమాధానం చెప్పారు.