అమెరికాకు ఓ దణ్ణం.. ట్రంప్‌కి ఓ దణ్ణం!

May 06, 2025
img

డోనాల్డ్ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడుగా రెండోసారి ఎన్నికైన తర్వాత విదేశీ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు పెంచారు. విదేశీ విద్యార్ధులని సైతం కుంటి సాకులతో తిప్పి పంపించేస్తున్నారు. ఇక అమెరికా వీసాల సంగతి సరేసరి. కొన్ని రోజులు, వారాలు లేదా నెలలకు పరిమితమైన టూరిస్ట్ వీసాలు ఇచ్చేందుకు కూడా ట్రంప్‌ ప్రభుత్వం ముప్పతిప్పలు పెడుతోంది. తాజాగా విదేశీ చిత్రాలపై 100 శాతం సుంకం విధించబోతున్నట్లు డోనాల్డ్ ట్రంప్‌ ప్రకటించారు. 

విదేశీ చిత్రాల వలన అమెరికన్ సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతొందనీ కనుక వాటిపై వంద శాతం సుంకాలు విధించాలని నిర్ణయించిన్నట్లు ట్రంప్‌ తెలిపారు. దీనిపై అమెరికా వాణిజ్యశాఖ తుది నిర్ణయం తీసుకుంటుందని ట్రంప్‌ చెప్పారు. 

ఒకప్పుడు భారతీయ సినిమాలు విదేశాలలో పెద్దగా ఆడేవి కావు. కానీ ఇప్పుడు భారత్‌తో సమానంగా అమెరికాలోను సినిమాలు విడుదల చేస్తున్నారు. ఆమెరికాలో తెలుగువాళ్ళు, భారతీయులు లక్షల మంది ఉన్నందున భారతీయ సినిమాలకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా నిలుస్తోంది. 

ఇది దృష్టిలో పెట్టుకునే వందలు, వేలకోట్ల పెట్టుబడితో పాన్ ఇండియా మూవీలు తీస్తున్నారు. కానీ ట్రంప్‌ ఒకేసారి 100 శాతం పన్ను పెంచేస్తే అమెరికాలో భారతీయ సినిమాలు ఆడే పరిస్థితి ఉండదు.

దీని వలన భారతీయ సినిమాలతో పాటు, వాటి నుంచి భారీగా ఆదాయం పొందుతున్న ఆమెరికాలో థియేటర్స్, వాటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించే సంస్థలు, అమెరికా ప్రభుత్వం కూడా ఆదాయం కోల్పోతాయి. కనుక ఇక ట్రంప్‌కి ఓ దణ్ణం పెట్టేసి అమెరికాని మరిచిపోక తప్పదు.

Related Post