డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశీయులపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తుండటం చాలా శోచనీయం. అమెరికా యూనివర్సిటీలలో ఉన్నత విద్య అభ్యసించడానికి వచ్చిన విదేశీ యువతని చిన్న చిన్న కారణాలతో వెనక్కు తిప్పి పంపించేస్తుండటంతో ఒక్కసారిగా వారి జీవితాలు తలక్రిందులవుతున్నాయి. తాజాగా అమెరికాలో సరదాగా పది రోజులు పర్యటించి వద్దామనుకున్నవారికీ వీసాలు తిరస్కరిస్తున్నారు.
న్యూఢిల్లీలో ఓ యువకుడు రెండు వారాలు అమెరికా పర్యటనకు వెళ్ళి రావాలనుకొని బీ-1 వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతను ఢిల్లీలోని అమెరికా ఎంబసీలో వీసా ఇంటర్వ్యూకు హాజరైనప్పుడు మూడు ప్రశ్నలు అడిగారు. మూడో ప్రశ్నకు సమాధానం చెప్పిన వెంటనే వీసా దరఖాస్తు తిరస్కరిస్తున్నామని ఆయన ఫోన్‌కి మెసేజ్ వచ్చింది. ఇంతకీ ఎంబసీ అధికారులు అడిగిన ప్రశ్నలు ఏమిటంటే..
ప్రశ్న: అమెరికాలో ఎక్కడికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు?ఎప్పుడు తిరిగి వస్తారు.
జవాబు: వెకేషన్ ట్రిప్ కోసం ఫ్లోరిడా వెళుతున్నాను. అక్కడ రెండు వారాలు గడిపి తిరిగి వచ్చేస్తాను.
ప్రశ్న: ఎప్పుడైనా విదేశాలలో పర్యటించారా?
జవాబు: లేదు.
ప్రశ్న : అమెరికాలో మీకు ఎవరైనా బంధుమిత్రులు ఉన్నారా?
జవాబు: నా గర్ల్ ఫ్రెండ్ ఉంది.
మెసేజ్: మీ వీసా తిరస్కరించబడింది.