అమెరికాలో స్కూలు పిల్లలపై కాల్పులు!

March 07, 2024
img

అమెరికాలో తుపాకులు మారుమ్రోగుతూనే ఉన్నాయి. ప్రజలు, విద్యార్దులు వాటికి బలవుతూనే ఉన్నారు. తాజాగా ఫిలాడెల్ఫియా నగరంలో స్కూలు బస్సు కోసం ఎదురుచూస్తున్న విద్యార్దులపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. వాటిలో 8 మంది విద్యార్దులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక విద్యార్ధి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ ఘటన అమెరికా కాలమాన ప్రకారం బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగింది. కాల్పులు జరిపిన ముగ్గురు వ్యక్తులు తుపాకులతో ఓ కారులో అక్కడకు చేరుకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కారులో నుంచి బయటకు వచ్చిన వెంటనే అక్కడ ‘సెప్టా స్కూలు బస్సు’ కోసం ఎదురుచూస్తూ కబుర్లు చెప్పుకుంటున్న విద్యార్దులపై 30 రౌండ్లు కాల్పులు జరిపారని పోలీస్ కమీషనర్‌గా కెవిన్ బెతెల్ చెప్పారు. కాల్పులు జరిపిన తర్వాత వారు ముగ్గురూ అదే కారులో పారిపోయారని చెప్పారు. 

ఆ సమయంలో ఘటనా స్థలానికి సమీపంలో ఉన్నవారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వచ్చి గాయపడిన విద్యార్దులను అంబులెన్సులలో సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రత్యక్ష సాక్షులు ఈ కాల్పుల దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి పోలీసులకు అందజేశారు. వాటి ఆధారంగా పోలీసులు ముగ్గురు దుండగుల కోసం గాలింపు మొదలుపెట్టారు.

Related Post