ట్రంప్ ని బ్రతిమాలుకోవడం కంటే..

April 22, 2017
img

హెచ్1-బి వీసాలపై కటినమైన ఆంక్షలు విదించడం, అమెరికా సంస్థలలో అమెరికన్లకే ఉద్యోగాలు ఇచ్చి తీరాలనే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం కారణంగా, భారత్ ఐటి ఉద్యోగులు, ఐటి పరిశ్రమల పరిస్థితి అయోమయంగా మారింది. కనుక ట్రంప్ సర్కార్ కు నచ్చజెప్పేందుకు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అమెరికాకు వెళ్ళారు. ఆయన వాషింగ్ టన్ లో అమెరికా వాణిజ్యమంత్రి విల్బర్‌ రోస్‌ తో సమావేశమైనప్పుడు భారతీయ నిపుణులు అమెరికా అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారని, కనుక హెచ్1-బి వీసాల జారీ విషయంలో కాస్త మృదువుగా వ్యవహరించాలని కోరారు. దానికి విల్బర్‌ రోస్‌ స్పందిస్తూ, ఈ ప్రక్రియపై సమీక్ష ఇంకా ఇప్పుడే మొదలుపెట్టమని, దానిపై తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

అయితే, హెచ్1-బి వీసాలపై ఆంక్షలు కటినతరం చేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకం చేసిన సంగతి అందరికీ తెలుసు. దానికి అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం పొందడానికి మరికొంత సమయం పట్టవచ్చునేమో కానీ ఆయన ఆదేశాలు అమలుకాకపోవు. అదే విషయం విల్బర్‌ రోస్‌ డిప్లమెటిక్ బాషలో సున్నితంగా చెప్పారు. 

ఈ చేదు నిజాన్ని భారత్ సర్కార్ తో సహా అందరూ గ్రహించారు. అయితే ఇంకా అమెరికా మీద ఆశలు పెట్టుకోవడమే విచిత్రంగా ఉంది. హెచ్1-బి వీసాలపై ఆంక్షలు అమలవడానికి మరికొంత సమయం పడుతుంది కనుక ఈలోగా ఈ సమస్యను ఏవిధంగా అధిగమించాలి? అని ఆలోచించే బదులు అంతవరకు మనకి బెడద లేదని సంతృప్తి పడటం, ట్రంప్ సంగతి తెలిసి కూడా ఇంకా అయనను బ్రతిమాలుకోవడం, లాబీయింగ్ ద్వారా ఈ ప్రక్రియను అడ్డుకోవడం లేదా పొడిగించాలనుకోవడం తప్పే. అవేవి ఈ సమస్యకు శాశ్విత పరిష్కారాలు కావు. పైగా సమయం గడిచేకొద్దీ పరిస్థితులు ఇంకా విషమించే ప్రమాదం ఉంది.

ఇప్పటికే ట్రంప్ స్పూర్తితో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌదీఅరేబియాలు కూడా భారతీయులకు తలుపులు మూసేయడానికి సిద్దం అవుతున్నాయి. పరిస్థితి విషమించిన తరువాత హడావుడిగా ఎటువంటి నిర్ణయాలు తీసుకొన్నా వాటి వలన నష్టమే తప్ప లాభం ఉండదని ఐటి ఉద్యోగులు, ఐటి సంస్థలు, భారత ప్రభుత్వమూ అందరూ గ్రహించాలి. కనుక ఇంకా ఆశగా గుడ్డి దీపం చుట్టూ ప్రదక్షిణాలు చేయడం కంటే వెలుతురు ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం చాల ఉత్తమం. అయితే ఈ సమస్యకు పరిష్కారాలు, ప్రత్యామ్నాయాలు కనుగొనడం అంత సులువేమీ కాదు కానీ వేరే మార్గం లేదని తెలిసినప్పుడు పరిష్కారం కోసమే ఆలోచించాలి తప్ప సమస్య గురించి ఎంత ఆలోచించినా ప్రయోజనం ఉండబోదు. 

Related Post