కర్నూలు బస్సు ప్రమాదం ఇంకా కళ్ళ ముందు మెదులుతూ ఉండగానే మళ్ళీ హైదరాబాద్‌లో మరో బస్సు ప్రమాదం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం మియాపూర్ నుంచి గుంటూరు బయలుదేరిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ వద్ద అదుపు తప్పి పక్కకు పడిపోయింది.
ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 15 మంది మాత్రమే ప్రయాణికులున్నారు. స్థానికులు వారిని బస్సులో నుంచి బయటకు తెచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
ఆ జంక్షన్ వద్ద ఉన్న మలుపులో వేగం తగ్గించకుండా ముందుకు తీసుకువెళ్ళడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన రెయిలింగ్ దీకొని పక్కకు పడిపోయింది. కానీ అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరుగలేదు. బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వారికి ఆసుపత్రులలో చికిత్స అందించి పంపించేశారు.
కర్నూల్ బస్సు ప్రమాదం నేపధ్యంలో తెలంగాణ రవాణాశాఖ అధికారులు రంగంలోకి దిగి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వాటితో పాటు స్కూలు బస్సులు, క్యాబ్, ఆటలను కూడా తనికీలు చేస్తున్నారు. సరైన పత్రాలు, ఫిట్ నెస్ లేని వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు.