మందు కొట్టి బండి నడిపాడు.. 19 మంది ప్రాణాలు తీశాడు!

October 25, 2025
img

కర్నూలు పట్టణ శివారులో నిన్న తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు అగ్ని ప్రమాదానికి కారణం శివ శంకర్ అనే యువకుడు బైక్‌పై వేగంగా దూసుకువచ్చి బస్సుని ఢీ కొట్టడం! ఈ ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు అతను మరో వ్యక్తితో కలిసి బైక్‌పై ఆ దారిలో ఉన్న పెట్రోల్ బంకుకి వచ్చాడు. అ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నాడు. 

అతను బంకులోకి వచ్చినప్పుడు సిబ్బంది ఎవరూ లేకపోవడంతో గట్టిగా కేకలు వేసి బండిపై వెళ్ళిపోతూ చిన్నగా అక్కడే జారాడు. కానీ కింద పడకుండా బండిని అదుపు చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ దృశ్యాలన్నీ బంకులో ఉన్న సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. 

అతను అక్కడి నుంచి మద్యం మత్తులోనే  బైక్‌పై వేగంగా దూసుకు వెళ్ళి హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళుతున్న బస్సుని బలంగా ఢీకొని దాని చక్రాల కింద నలిగి చనిపోయాడు. కానీ అతని వలన జరిగిన ఈ అగ్నిప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనమైపోయారు. వారిలో 10 ఏళ్ళు వయసున్న మన్విత, 12 ఏళ్ళు వయసున్న మనీష్ కూడా చనిపోయారు. 

మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని ఏపీ, తెలంగాణ పోలీసులు ప్రతీ రోజూ సోషల్ మీడియాలో హెచ్చరిస్తూనే ఉంటారు. తరచూ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తూనే ఉంటారు. అయినా మార్పు రావడం లేదు. 

కనీసం ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారిని, వారి కుటుంబాల శోకాన్ని చూసిన తర్వాత కొందరైనా మారుతారని ఆశిద్దాం.

(వీడియో తుపాకీ సౌజన్యంతో) 

Related Post