సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. దీనిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై లోతుగా చర్చించారు. బీసీ రిజర్వేషన్స్‌పై హైకోర్టు నవంబర్ 3న తుది తీర్పు చెప్పే అవకాశం ఉంది. కనుక అది చూసిన తర్వాత నవంబర్ 7న మరోసారి మంత్రివర్గ సమావేశం నిర్వహించి చర్చించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎస్‌ఎల్‌బీసి సొరంగంలో ప్రమాదం జరిగి తవ్వకం పనులు నిలిచిపోయాయి. ఇప్పటికే రెండు వైపుల నుంచి సుమారు 33 కిమీ సొరంగం తవ్వకం పనులు పూర్తయ్యాయి. మరో 9 కిమీ తవ్వితే ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. అత్యాధునిక టన్నల్ బోరింగ్ మెషీన్‌తో మిగిలిన 9 కిమీ సొరంగం తవ్వకం పనులు పూర్తి చేసేందుకు మరో కాంట్రాక్ట్ సంస్థ ముందుకు వచ్చింది. కనుక వీలైనంత త్వరగా మళ్ళీ సొరంగం తవ్వకం పనులు మొదలు పెట్టాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.