ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతా: కవిత

October 23, 2025


img

తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత నేడు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ జాగృతి ఓ ఎన్జీవో సంస్థ అయినప్పటికీ ఎప్పుడూ రాజకీయాలలోనే ఉంది. ఉంటుంది. కనుక రాజకీయాలు చేయాలంటే పార్టీయే అవసరం లేదు. రాజకీయ పార్టీ నా కోసం కాదు. ప్రజల కోసమే. కనుక ప్రజలు కోరుకుంటే తప్పకుండా పార్టీ పెడతాను. అదేమీ పెద్ద విషయం కాదు.

తెలంగాణలో మూడు, ఏపీ, తమిళనాడులో చెరో రెండు, కేరళలో గల్లీకో పార్టీ ఉన్నాయి. కనుక తెలంగాణలో మరో కొత్త పార్టీ వస్తే ఇబ్బంది ఉండదు. కానీ పార్టీ పెట్టడానికి సమయం, సందర్భం ఉండాలి. ప్రస్తుతం నేను ‘జాగృతి జనం బాట’తో ప్రజల వద్దకు వెళుతున్నాను. నాలుగు నెలలు ప్రజలతో మమేకమై వారి సమస్యలు, అవసరాలు, అభిప్రాయలు తెలుసుకున్నాక మేధావులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటాను,” అని అన్నారు. 

కాంగ్రెస్‌, బీజేపిల ధాటికి కేసీఆర్‌ అంతటివాడు తలవంచక తప్పలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌, బీజేపిల మద్య రాజకీయ ఆధిపత్యపోరు జరుగుతుంటే రెండో స్థానంలో నిలబడేందుకు బీఆర్ఎస్‌ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలతో బీఆర్ఎస్‌ పార్టీ పరిస్థితి ఏమిటో తేలిపోతుంది.

కనుక మూడు పార్టీలకే రాష్ట్రం సరిపోనప్పుడు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీతో ప్రవేశిస్తే నిలబడగాలరా? నాలుగు నెలల తర్వాత పార్టీ పెడితే అప్పుడు మొదలవుతుంది అసలు స్టోరీ! అంతవరకు ఆమె చెప్పే సామాజిక న్యాయం కబుర్లు వింటూ కాలక్షేపం చేయక తప్పదు. 


Related Post