తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితని పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. ఖమ్మం శివారులో వెలుగుమట్ల భూదాన్ భూములలో పేదల ఇళ్ళని జిల్లా అధికారులు కూల్చివేయడాన్ని నిరసిస్తూ బాధితులకు న్యాయం చేయాలంటూ సోమవారం ఉదయం నుంచి ఆమె స్థానిక అంబేద్కర్ భవన్‌లో నిరాహార దీక్ష చేపట్టారు.
ఆమెతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐకాస చైర్మన్ విశారదన్ మహారాజ్‌తో సహా వారి అనుచరులు దీక్ష చేపట్టారు. సమాచారం అందుకున్న ఖమ్మం పోలీసులు వారి దీక్ష భగ్నం చేసి ఆమెను హైదరాబాద్ తరలించారు.
ఆమె దీక్ష మొదలుపెట్టినప్పుడు మీడియా, నిర్వాసితులతో మాట్లాడుతూ, “ప్రభుత్వం పేదల ఇళ్ళని కూల్చేసి వారిని రోడ్డుపై పడేయడం చాలా దారుణం. ప్రభుత్వమే వారికి న్యాయం చేస్తుందని ఇన్ని రోజులూ ఎదురుచూశాము కానీ పట్టించుకోకపోవడంతో నిర్వాసితుల తరపున పోరాడేందుకు నేను రావాల్సివచ్చింది.
రోడ్డుపై ధర్నా చేస్తే ట్రాఫిక్‌కి ఇబ్బందవుతుందని చెపితే ఇక్కడ కూర్చున్నాము. జిల్లా కలెక్టర్ వచ్చి నిర్వాసితులకు న్యాయం చేస్తామని చెప్తారని ఎదురు చూస్తుంటే, పోలీసులను పంపించి మా దీక్ష భగ్నం చేయించారు. కానీ నిర్వాసితులకు న్యాయం జరిగేవరకు నా పోరాటం ఆగదు,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.