నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజా భవన్‌లో జరిగిన మహిళా సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “గాంధీ ప్రాజెక్టు కింద ఇళ్ళు కోల్పోతున్న వారికి, ముఖ్యంగా మధుపార్క్ రిడ్జ్ లో నివసిస్తున్నవారికి ఓ విషయం చెప్పదలచుకున్నా. ఈ ప్రాజెక్టు గురించి అనుకున్నప్పుడే మొదట మూసీ నిర్వాసితుల గురించి ఆలోచించాము. బఫర్ జోన్లో తెలిసో తెలియకో ఇళ్ళు కట్టుకున్నవారందరినీ రోడ్డున పడేయడం భావ్యం కాదని భావించి, అందరికీ పునరావాసం ఏర్పాటు చేస్తున్నాము.
మధుపార్క్ రిడ్జ్ వాసులకు సమీపంలోనే ఎడెకరాల భూమి కేటాయించి, దానిలో వారు కొత్త అపార్ట్‌మెంట్ నిర్మించుకునేందుకు అవసరమైన సొమ్ముని ముందుగానే వారి బ్యాంక్ ఖాతాలలో జమా చేస్తామని మా ఎమ్మెల్యే ద్వారా చెప్పించాము. నిబంధనల ప్రకారం బఫర్ జోన్‌లో ఉన్నవారికి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మానవతాద్రుక్పదంతో వారికి సాయపడేందుకు సిద్ధపడ్డాము.
కానీ ఈలోగా ప్రతిపక్ష నేతలు వారి వద్దకు వెళ్ళి రెచ్చగొట్టి వారిచేత ఏదేదో మాట్లాడిస్తున్నారు. కానీ ప్రతిపక్ష నేతలకు మీ కష్టాలు ముఖ్యం కాదు. రెండు మూడు రోజులు మీడియాలో వాళ్ళు కనపడటమే ముఖ్యం. కనుక ఇప్పుడు మీ చుట్టూ తిరుగుతున్న ప్రతిపక్ష నేతలెవరూ మీకు సాయపడరు. ప్రభుత్వమే సాయపడుతుంది.
కనుక వారి మాయ మాటలు నమ్మి మోసపోవద్దు. కాదని వారి మాయమాటలు నమ్మితే చివరికి మీరే నష్టపోతారు. ఎందుకంటే మీరుంటున్న బఫర్ జోన్లో ఇళ్ళ కు భవిష్యత్‌లో జీరో వాల్యూ. కనుక ప్రభుత్వం అందించే సాయం తీసుకొని మీరందరూ సొసైటీగా ఏర్పడి ఎంచక్కా కొత్త అపార్ట్‌మెంట్ నిర్మించుకోండి,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.