తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తాజా ఇంటర్వ్యూలో “నన్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించినప్పుడే ఆ పార్టీతో నాకు సంబంధం తెగిపోయింది. ఇప్పుడు నేను కొత్త రాజకీయ పార్టీ పెట్టుకుంటున్నాను. దానిలో కేసీఆర్ పేరు, ఫోటోలు వాడబోము. ఎందుకంటే మా పార్టీకి నేను, బీఆర్ఎస్ పార్టీకి ఆయన అధ్యక్షులు. వేరే పార్టీ అధ్యక్షుడి పేరు, ఫోటోలు మరో పార్టీ వాడుకోవడం సబబు కూడా కాదు. కనుక మా కొత్త పార్టీ కార్యాలయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో, తెలంగాణ తల్లి ఫోటోలు పెట్టుకుంటాము.
కేసీఆర్ పేరు, ఫోటో లేకుండానే మేము ప్రజల వద్దకు వెళ్తాం. వారు మమ్మల్ని ఆదరిస్తారో లేదో వారిష్టం,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.
కేటీఆర్ నేటికీ తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తుంటే, ఒంటరి పోరాటం చేస్తున్న కల్వకుంట్ల కవిత తన స్వశక్తితో రాజకీయాలు చేస్తూ సొంత గుర్తింపు సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఆమె విజయవంతమైతే మహిళా సాధికారతకు ప్రతీకగా నిలవడం ఖాయం. ఒకవేళ ఈ ప్రయత్నంలో ఓడిపోయినా ధైర్యంగా ఇలాంటి ప్రయత్నం చేసినందుకు ఆమెను అందరూ ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.